యాదగిరిగుట్ట, జూన్ 12 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహనంపై వేంచేపు సేవను కొనసాగించారు. తూర్పుకు అభీష్టంగా స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి నిత్య తిరుకల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నరపాటు సాగిన వేడుకల్లో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలు తెల్లవారుజామునే ప్రారంభమయ్యాయి. తిరువారాధన జరిపి స్వామి, అమ్మవార్లకు బాలభోగం నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లను గరుఢ, తిరుచ్చీ వాహనాలపై వేంచేపు చేసి ఆలయ మాఢవీధుల్లో సేవను ఊరేగించారు. రాత్రి దర్బార్, శయనోత్సవ సేవలు నిర్వహించారు. రామలింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరిపించారు. సాయంత్రం రామలింగేశ్వరుడి సేవను శివాలయ మాఢవీధుల్లో ఊరేగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి ఆలయ ఖజానాకు రూ.30,78,007 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
ఆలయ కార్యకలాపాల పని తీరుపై కమిషనర్ పర్యవేక్షణ..
ఆలయ కార్యకలాపాల పనితీరును రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సోమవారం పర్యవేక్షించారు. ఈఓ కార్యాలయం లో సమీక్ష జరిపి వివిధ విభాగాలకు చెందిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదట స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
దేవాలయాన్ని సందర్శించిన శృంగేరి శివగంగ పీఠాధీశ్వరులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయాన్ని శృంగేరి శివగంగ పీఠాధీశ్వరులు దర్శించుకుని ఆనందభరితుడయ్యారు. స్వామివారి ఆలయం గొప్పగా, మహాద్భుతంగా రూపుదిద్దుకున్నదని పరవశించిపోయారు. స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కాండూరి వెంకటాచార్యులు స్వామికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు నాలుగు వేదాలు పఠిస్తూ స్వామివారికి పండ్లు, ప్రసాదం, స్వామివారి శేష వస్ర్తాలను అందజేశారు. అనంతరం ఆలయ నిర్మాణాలను తిలకించారు. స్వామి వెంట ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ రఘు, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు.