హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నాలుగున్నరేండ్లకే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని కాళోజీ హెల్త్ వర్సిటీ మరోసారి స్పష్టంచేసింది. వర్సిటీ రిజిస్ట్రార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. అదనపు ట్యూషన్ ఫీజుల పేరిట కాలేజీలు విద్యార్థులను వేధించవద్దని సూచించింది. టీఏఎఫ్ఆర్సీ రూల్స్ ప్రకారం నాలుగున్నరేండ్లకే ఫీజులు వసూలు చేయాల్సి ఉండగా.. ఐదో ఏడాది ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని కాళోజీ వర్సిటీ వీసీకి పలువురు ఫిర్యాదు చేశారు.
మెడికల్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు రోటరీ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. చాలా కాలేజీలు ఈ ఇంటర్న్షిప్ కాలానికి కూడా అదనంగా ఫీజు కట్టాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనిపై సీరియస్ అయిన వర్సిటీ కేవలం నాలుగున్నరేండ్ల కాలానికి మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించింది.