సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): నగరంలో శనివారం కురిసిన మోస్తరు వర్షానికి సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరగా, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. మియాపూర్‌లో అత్యధికంగా 4.38 సెం.మీలు, షేక్‌పేటలో 4.18 సెం.మీలు, కేపీహెచ్బీలో 3.13 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావం కొనసాగడం, రుతుపవనాల ఆగమనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు వెల్లడించారు.