హైదరాబాద్,ఆగస్టు 4, (నమస్తే తెలంగాణ) : ఎల్లంపల్లి డ్యామ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. నాటి కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేస్తే.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పూర్తిచేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎల్లంపల్లిలో నిల్వ ఉండే 20 టీఎంసీల నీరు.. కాళేశ్వరం 240 టీఎంసీల ప్రాజెక్టులో భాగమేనని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కానీ, రానున్న ఎనిమిది నెలలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు జీవనాధారమని వివరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నెపల్లి వద్ద కాఫర్‌డ్యామ్ నిర్మించి ఉంటే ఇప్పటికే నీటిని లిఫ్ట్ చేసేవాళ్లమని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేదని, నీటిని వదలడానికి ఎన్డీఎస్ఏను సాకుగా చూపుతూ ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు. సీఎం తన మనవడి సంతోషం కోసం మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని కాఫర్‌డ్యామ్ నిర్మాణానికి వినియోగించి ఉంటే పనులు ఎప్పడో పూర్తయ్యేవని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇంజినీర్లను అవమానించేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నదని, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణే ఏకైక మార్గమని, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు సురక్షితంగానే ఉన్నాయని చెప్పారు. చేశారు.
గత కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి వద్ద ఒప్పందాలు కుదరలేదని, మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల నీటి మట్టానికి ఒప్పుకోకపోవడం, అకడ కేవలం 40 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉండటంతో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని స్వరాష్ట్రంలో మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాల్సి వచ్చిందని టీ జీవన్‌రెడ్డి వివరించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మించడంతో 40 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి బదులు 240 టీఎంసీల నీటి లభ్యత నేడు లభిస్తుందని, ఇది 70 శాతం రాష్ట్ర ప్రజలకు లాభదాయకమని తెలిపారు. దీంతో నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ రివర్స్ పంపింగ్ విధానం ద్వారానే శ్రీరాంసాగర్ వరదకాలువకు జీవం పోస్తూ, రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని విజయవంతంగా ఎత్తిపోస్తున్నట్టు వివరించారు.
మేడిగడ్డ వద్ద మరమ్మతులు చేపట్టేందుకు ఎల్అండ్టీ సంస్థ ముందుకొచ్చినా, కేసీఆర్‌పై ఉన్న కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయించడం లేదని టీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డికి కలలో కూడా కేసీఆర్ కనిపిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రూ.100 కోట్లలోపే కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ఖర్చవుతుందని, రాత్రీపగలు పనిచేయిస్తే నెల రోజుల్లోపే నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికైనా నిర్మాణ పనులకు పూనుకోవాలని కోరారు. రాజకీయ కక్షసాధింపు చర్యలు మానుకుని, ఇప్పటికైనా కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసి ప్రజలకు సాగునీరు అందించే బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదని హితవు పలికారు.