ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి సంగారెడ్డి.. రెండింటి మధ్య దూరం దాదాపు 330 కిలోమీటర్లు.. అక్కడి నుంచి ఇక్కడికి గోదావరి జలాలు వస్తాయా? అంటే వచ్చి తీరుతాయని తెలంగాణ భగీరథుడు చంద్రశేఖరుడు సంకల్పించారు. ఆ సంకల్పానికి మెచ్చిన గంగమ్మ తల్లి కూడా చల్లని చూపు చూసింది. ఆ కాళేశ్వరుడు గంగమ్మను విడువంగా.. ఈ భగీరథుడు తెలంగాణ అంతటా నడిపించి నేలను సస్యశామలం చేస్తున్నాడు. ఇప్పుడు కాళేశ్వర జలాలను సంగారెడ్డి జిల్లాకు తెచ్చి ఇక్కడి భూమికి ‘సంగమేశ్వర, బసవేశ్వర’ పథకాలతో జలాభిషేకం చేసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు ఈ నెల 21న ముహూర్తం ఖరారైంది.
సంగారెడ్డి / హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా సాగునీటి గోస తీరనున్నది. మంజీరా జలాలను రైతుల పొలాల్లోకి పారించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చి సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నారు. సంగారెడ్డి సాగునీటి అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్.. జిల్లాకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. టెండరు ప్రక్రియ పూర్తి కావడంతో ఈ నెల 21న సీఎం కేసీఆర్ నారాయణఖేడ్‌లో వీటికి శంకుస్థాపన చేయనున్నారు. రెండేండ్లలో ఈ పథకాలు పూర్తి కానున్నాయి. వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,427 కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ ఎత్తిపోతలతో నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో మొత్తం 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. నిర్మాణ పనులను టెండర్ల ద్వారా మేఘా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారు.
‘సంగమేశ్వర’తో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు
సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను సింగూరుకు తీసుకువస్తారు. సింగూరు బ్యాక్ వాటర్ నుంచి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఎల్లాపూర్ నుంచి మొదట నీటిని ఎత్తిపోసి కాల్వల ద్వారా జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి రైతులకు సాగునీరు అందజేస్తారు. తద్వారా 3 నియోజకవర్గాల్లోని 12 మండలాలకు చెందిన 231 గ్రామాలకు సాగు నీరు అందుతుంది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా మూడు లిఫ్టులు, మూడు పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేయనున్నారు. 215 కిలోమీటర్ల మేర ఆరు కాల్వలను నిర్మించనున్నారు. ఈ ఎత్తిపోతల నిర్మాణానికి 6,293 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని అంచనా.
బసవేశ్వర ఎత్తిపోతలతో 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు
నారాయణఖేడ్ ప్రాంత రైతులకు సాగునీరు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ బసవేశ్వర పథకాన్ని మంజూరు చేశారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో ఉన్న 166 గ్రామాల్లోని 1,71,407 ఎకరాలకు సాగునీరు అందనున్నది. మనూరు మండలం బోరంచ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయనున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా 74 మీటర్ల మేర గోదావరి జలాలను ఎత్తిపోయనున్నారు. రెండు పంప్‌హౌస్‌లు, ఏడు కాల్వలు నిర్మించనున్నారు. 160 కిలోమీటర్ల మేర ఉండే ఆరు కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వనున్నారు. ఈ పథకానికి 4,150 ఎకరాల భూసేకరణ అవసరం అవుతుందని అంచనా.
రెండు పథకాలకూ దేవుళ్ల పేర్లు
సంగారెడ్డి జిల్లా రైతాంగానికి వరం లాంటి రెండు ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ దేవుళ్ల పేరు పెట్టి తన భక్తి చాటుకొన్నారు. సంగారెడ్డి జిల్లాలో శైవులు, లింగాయత్‌లు ఎక్కువ. అందుకే ఝరాసంగంలో కొలువైన కేతకీ సంగమేశ్వర స్వామి పేరిట జహీరాబాద్ ప్రాంత ఎత్తిపోతల పథకానికి సంగమేశ్వర ఎత్తిపోతల పథకం అని నామకరణం చేశారు. నారాయణఖేడ్ ప్రాంతంలో నిర్మించే ఎత్తిపోతల పథకానికి లింగాయత్‌ల ఆరాధ్య గురువైన బసవేశ్వరుడి పేరును సీఎం కేసీఆర్ పెట్టారు.
నాడు కేసీఆర్ ‘సింగూరు సింహగర్జన’
సింగూరు ప్రాజెక్టు ఉన్నా సమైక్య పాలనలో రైతన్నలకు చుక్కసాగునీరు ఇవ్వలేదు. ఎన్నికలు వచ్చాయంటే చాలు ‘మంజీరా’ నీటి పోరాటం తెరపైకి వచ్చేది. సమైక్యపాలనలోని పార్టీల సాగునీటి హామీలు చివరకు నీటిమూటలయ్యేవి. ఏండ్లుగా సంగారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి ఇదే. నారాయణఖేడ్ లాంటి మారుమూల ప్రాంతంలో సాగునీటితో పాటు తాగునీటికీ జనం ఇక్కట్లు పడేవారు. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ సంగారెడ్డి ప్రాంత రైతులు పక్షాన నిలబడ్డారు. ‘సింగూరు సింహగర్జన’ పేరిట మంజీరా జలాల సాధన కోసం కేసీఆర్ పోరాటం చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలోనే సింగూరు ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా చేశారు. సీఎం అయ్యాక మిషన్ భగీరథ ద్వారా జిల్లా అంతటికీ తాగునీటిని అందించారు.
అర కిలోమీటరు ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత
గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 100 మీటర్లు. ఇక్కడ నిల్వ చేసిన నీటిని సముద్ర మట్టానికి 88 మీటర్ల ఎత్తు నుంచి కన్నెపల్లి వద్ద నిర్మించిన లక్ష్మీ పంపుహౌజ్ ద్వారా 119 మీటర్లు ఉన్న సరస్వతీ బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి 130 మీటర్లు ఉన్న పార్వతీ బరాజ్‌లోకి నీటిని తరలిస్తున్నారు. అక్కడి నుంచి 148 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్లంపల్లికి తరలిస్తారు. ఇక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నంది పంపుహౌజ్‌కు, తర్వాత జంట సొరంగాల ద్వారా గాయత్రి పంపుహౌజ్, ఆపై శ్రీరాజరాజేశ్వర జలాశయానికి చేరుకొంటాయి. దీని ఎత్తు 323 మీటర్లు. ఇక్కడి నుంచి గోదావరి జలాలను 397 మీటర్ల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ జలాశయానికి, అక్కడి నుంచి 480 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్ జలాశయంలోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి 557 మీటర్ల ఎత్తులో మల్లన్నసాగర్‌లోకి, అక్కడి నుంచి 614 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మసాగర్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ అంతా విజయవంతంగా సాగింది. ఇక, ఇక్కడి నుంచి గోదావరి జలాలను సముద్రమట్టానికి 523 మీటర్ల ఎత్తులో ఉన్న సింగూరు జలాశయానికి తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఏకంగా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం జహీరాబాద్‌లోని 664.5 మీటర్లపైన ఉన్న గోవిందాపూర్ కెనాల్‌కు తరలించాల్సి ఉన్నది. ఇది పూర్తయితే గోదావరి జలాలు అర కిలోమీటరు ఎత్తుకు ఎగిసిపడనున్నాయి.
సంగమేశ్వర ఎత్తిపోతల స్వరూపం
స్కీంపేరు: సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్
ఖర్చు చేయనున్న నిధులు: రూ. 2,653 కోట్లు
నిర్మాణ సంస్థ: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ లిమిటెడ్
ఆయకట్టు: 2.19 లక్షల ఎకరాలు
సాగునీరు అందే నియోజకవర్గాలు: జహీరాబాద్, సంగారెడ్డి, అందోల్
సాగునీరు అందే మండలాలు: 11
సాగునీరు అందే గ్రామాలు: 231
లిఫ్ట్ ఎత్తు: 147 మీటర్లు
పంపుల సంఖ్య: 3
విద్యుత్తు వినియోగం: 140 మెగావాట్లు
కాల్వల దూరం: 215 కిలోమీటర్లు
కాల్వలు: రాయికోడ్ కెనాల్ (56.85 కిలోమీటర్లు), మునిపల్లి కెనాల్ (11.40 కిలోమీటర్లు), కంది కెనాల్ (44.85 కిలోమీటర్లు), జహీరాబాద్ కెనాల్(30.95 కిలోమీటర్లు), గోవిందాపూర్ కెనాల్ (19.15 కిలోమీటర్లు), హద్నూర్ కెనాల్ (51.80 కిలోమీటర్లు)
ఆయకట్టు వివరాలు:
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలు
అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 66 గ్రామాల్లోని 65,816 ఎకరాలు
సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలు
బసవేశ్వర ఎత్తిపోతల స్వరూపం
స్కీం పేరు: బసవేశ్వర ఎత్తిపోతల పథకం
ఖర్చు చేయనున్న నిధులు: రూ.1,774 కోట్లు
నిర్మాణ సంస్థ: మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ లిమిటెడ్
ఆయకట్టు: 1.71 లక్షల ఎకరాలు
సాగునీరు అందే నియోజకవర్గాలు: నారాయణఖేడ్, అందోల్
సాగునీరు అందే మండలాలు: 8
సాగునీరు అందే గ్రామాలు: 166
లిఫ్ట్ ఎత్తు: 74.52 మీటర్లు
పంపుల సంఖ్య: 2
విద్యుత్తు వినియోగం: 70 మెగావాట్లు
కాల్వల దూరం: 160 కిలోమీటర్లు
కాల్వలు: కరస్‌గుత్తి కెనాల్ (88.20 కిలోమీటర్లు), కరస్‌గుత్తి బ్రాంచి కెనాల్ (25.80 కిలోమీటర్లు), వట్పల్లి కెనాల్ (20 కిలోమీటర్లు), నారాయణఖేడ్ కెనాల్ (20 కిలోమీటర్లు), రేగోడ్ కెనాల్ (12.90 కిలోమీటర్లు), కంగ్టి కెనాల్ (16.80 కిలోమీటర్లు), అంతర్గావ్ కెనాల్ (16.40 కిలోమీటర్లు)
ఆయకట్టు వివరాలు:
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో 130 గ్రామాల్లోని 1,37,407 ఎకరాలు
అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల పరిధిలో 36 గ్రామాల్లో 34,000 ఎకరాలు