హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 23(నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి దేవాలయ (Padmanabhaswamy Temple) చెరువు ఉన్నది. ఆ కోనేరును అనంత పద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు. సర్వే నంబర్ 365లోని 6.02 ఎకరాల్లో విస్తరించిన ఈ కుంటను కబ్జా చేసేందుకు కొంతకాలంగా కొందరు ప్రయత్నిస్తున్నారు. గతంలో దేవాలయ భూమిని అక్రమంగా అమ్మిన అర్చకులే ఆ కుంటను తమకు అమ్మారని చెప్తున్నారు. ఆ స్థలాన్ని తాము తీసుకుంటామంటూ కోర్టును ఆశ్రయించారు. దాదాపు రూ.300 కోట్ల విలువైన ఆ కుంట కబ్జాకు గురికాకుండా నిరోధించి, దేవాలయ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి కోర్టులో కేసు బెంచిపైకి రాకుండా అడ్డుపడుతున్నారు. మరోవైపు చెరువుల పరిరక్షణే తమ ధ్యేయమని చెప్తున్న హైడ్రాకు ఈ విషయం తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు.
నీటిపారుదల శాఖ నిర్వహించిన సర్వేలో అనంత పద్మనాభస్వామి కుంట 6.049 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్టు నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధ్రువీకరించడంతోపాటు సంబంధిత మ్యాప్‌ను కూడా రూపొందించారు. మరోవైపు అత్తాపూర్ గ్రామపటంలో కూడా 365 సర్వే నంబర్లో చెరువు ఉన్నట్టు చూపిస్తున్నదని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేవాదాయ శాఖ సైతం ఆ భూమి తమదేనని ప్రకటించింది. అయినప్పటికీ కొందరు కబ్జాదారులు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత సహకారంతో ఆ చెరువును మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంత పద్మనాభస్వామి ఆలయ భూములను కొట్టేయాలని ఎప్పటినుంచో కన్నేసిన ఆ నేత.. ఇప్పుడు కబ్జాదారులకు సహకరిస్తూ దేవాదాయ శాఖపై ఒత్తిడి పెంచుతున్నట్టు సమాచారం. ఆ చెరువును ఆనుకుని ఆర్డీవో ఆఫీసు ఉన్నది. దీంతో తొలుత ఆ చెరువు ముందు వైపున కనీసం రెండెకరాలైనా కొట్టేయాలని దీనిపై కేసు వేసిన ఇరువర్గాలు ఓ ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ఆ రెండెకరాల స్థలం రూ.50-60 కోట్లకుపైగా ధర పలుకుతుందని, అది అత్తాపూర్ దగ్గర నుంచి వెళ్లే ప్రధానరహదారికి కలుస్తుందని స్థానికులు తెలిపారు.
అనంత పద్మనాభస్వామి కుంటను గతంలో మట్టిపోసి మూసేశారు. అనంతరం ఆ చెరువు పూడికతీత, ఇతర అభివృద్ధి పనుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో సుమారు రూ.40 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ, ఆ చెరువును చెరబట్టడంలో భాగంగా అర్చకుడి నుంచి భూమి కొనుగోలు చేశామంటూ కొందరు కోర్టును ఆశ్రయించి స్టేటస్కో ఉత్తర్వులు తెచ్చారు. దీంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. మరోవైపు అది చెరువేనని హైకోర్టుకు ఇరిగేషన్ శాఖ స్పష్టత ఇచ్చినప్పటికీ దేవాదాయ శాఖ మాత్రం ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దీని వెనుక మర్మమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేత బెదిరింపులతోపాటు కబ్జాదారుల నుంచి కొంత లావాదేవీలు జరగడం వల్లనే దేవాదాయ శాఖ కౌంటర్ వేయలేదని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో పనిచేసిన రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ ముఖ్య అధికారికి ఈ లావాదేవీల్లో భారీగా ముడుపులు ముట్టాయని, అందుకే కౌంటర్ వేయలేదని వినికిడి. మరోవైపు ఆ భూమిపై ఆర్డీవో కోర్టులో దేవాదాయ శాఖకు అనుకూలమైన తీర్పు రావడంతో కబ్జాదారులు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకున్నారు. దీనిపై త్వరలోనే తీర్పు రానున్నట్టు సమాచారం.
జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల పరిరక్షణకు కంకణం కట్టుకున్నామంటూ పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్న హైడ్రా అనంత పద్మనాభస్వామి కుంట విషయంలో ఏమాత్రం స్పందించడం లేదు. ఆ చెరువు చుట్టూ కట్ట ఏర్పాటుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇస్తే కొందరు స్థానిక నేతలు కాంగ్రెస్ పెద్దలతో కలిసి ఆ పనులను అడ్డుకున్నారు. భారీ వర్షాలకు ఆ కట్ట తెగిపోతే అనంత పద్మనాభస్వామి దేవాలయం, అందులోని గోశాల పక్కనే ఉన్న పాండురంగానగర్, హుడా కాలనీలు మునిగిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుంటను కాపాడాలంటూ ఆగస్ట్‌లో ‘ప్రజావాణి’ సందర్భంగా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఎట్టకేలకు హైడ్రా అధికారులు వచ్చారని, పద్మనాభస్వామి కుంట విషయమై కోర్టులో కేసు నడుస్తున్నందున తామేం చేయలేమంటూ చేతులెత్తేసి వెళ్లిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు కేసులున్న ఇతర ప్రాంతాల్లో కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తున్నారా అంటూ హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. అది చెరువేనని దేవాదాయ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు స్పష్టం చేసిన తర్వాత కూడా హైడ్రా చొరవ తీసుకోకపోవడం వెనక మతలబు ఏమిటని నిలదీస్తున్నారు.