‘కాంత’ చాలా అరుదైన చిత్రమని, ఇలాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయని చెప్పారు కథానాయకులు దుల్కర్ సల్మాన్, రానా. వారిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తూ, నిర్మించిన సినిమా నేపథ్య పీరియాడిక్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకుడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం హీరోలు దుల్కర్ సల్మాన్, రానా విలేకరులతో ముచ్చటించారు. రానా మాట్లాడుతూ ‘పూర్తి ఫిక్షనల్ కథ ఇది. 1950 నాటి సంఘటనల నుంచి స్ఫూర్తిపొంది రాశారు. ఇద్దరు వ్యక్తులు వాళ్ల ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ కోసం గొడవలు పడిన నేపథ్యం ఆసక్తినిరేకెత్తిస్తుంది. డార్క్‌సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్‌గా ఈ కథను చెప్పొచ్చు. 1950 కాలంలో సంగీతం, సాహిత్యానికి చాలా ప్రాధాన్యం ఉండేది.
కళలో పరిణితి కనిపించేది. అందుకే ఆ కాలాన్ని ఎంచుకున్నాం. నా దృష్టిలో సినిమా మాత్రమే కాలాన్ని రీక్రియేట్ చేయగలదు. ఈ సినిమా కోసం అప్పటి కాలమాన పరిస్థితుల్ని రీక్రియేట్ చేశాం. ఈ కథ విన్న వెంటనే దుల్కర్ సల్మాన్ పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది’ అన్నారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నా జీవితంలో చాలా స్పెషల్. ఈ కథ విన్నప్పుడే రానాతో కలిసి తప్పకుండా ఈ సినిమా చేయాలనుకున్నా. 50ల నాటి కథ కాబట్టి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరికొత్త ఫీల్‌ను కలిగిస్తాయి. నేను, రానా…ఇద్దరం సినిమాను అమితంగా ప్రేమిస్తాం. అదే మా ప్రపంచం. అందుకే ఈ కథలో నటించడంతో పాటు నిర్మాణంలో కూడా భాగమయ్యాం. 1950కాలంలో వాడిన సినిమా తాలూకు కొన్ని అరుదైన పరికరాలను ఈ సినిమాలో చూపించాం. పాతాళభైరవికి ఉపయోగించిన కెమెరాను చూపించాం. కాలాన్ని రీక్రియేట్ చేసే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి’ అన్నారు.