రష్మికను ‘గీత గోవిందం’ టైమ్ నుంచి చూస్తున్నా. తను ఈ సినిమాలో భూమాదేవి పాత్రలాగే అనిపిస్తుంది. కెరీర్లో ఉన్నతస్థితిలో ఉండి కూడా ఇలాంటి గొప్పకథను ప్రేక్షకులకు చెప్పాలనుకోవడం ఆనందంగా ఉంది. రషీ (రష్మిక మందన్న) సినీ ప్రయాణాన్ని చూసి నేను చాలా గర్వపడుతున్నా’ అని అన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్మీట్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ రోజే సినిమా చూశా. చాలా సన్నివేశాల్లో కన్నీళ్లు ఆపుకోవాల్సి వచ్చింది. నా హృదయం భారమైంది. ఇటీవలకాలంలో నేను చూసిన బెస్ట్ఫిల్మ్ ఇదే. మహిళల స్వేచ్ఛ, స్వయంనిర్ణయాధికారం, ఆత్మాభిమానం గురించి గొప్పగా చెప్పారు’ అన్నారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడే నాకు ఈ సినిమానే ఫస్ట్ చేయాలనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు నా జీవితంలో కూడా జరిగాయి. మనందరి జీవితాల్లో కూడా జరిగే ఉంటాయి. ఈ ఫిల్మ్ ద్వారా మీరందరూ స్వేచ్ఛను, ప్రేమను, ఓదార్పును పొందారని భావిస్తున్నా. ఈ సినిమాలో చెప్పిన అంశాలకు మీరందరూ కనెక్ట్ అయిపోయి బాధను ఫీలవుతున్నారు. నిజంగా నాకు అదే పెద్ద అవార్డు. విజయ్ ఈ సినిమా విషయంలో మాకు మొదటి నుంచి అండగా ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయ్ దేవరకొండలాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అదొక బ్లెస్సింగ్ లాంటిది’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, బన్నీవాసు, ఎస్కేఎన్, సాయిరాజేష్‌తో పాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.