మహేశ్‌తో రాజమౌళి చేస్తున్న సినిమా ఇప్పటికే వందరోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఈ నెల 15న ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్‌ను కూడా నిర్వహించనున్నారు. సినిమా టైటిల్ కూడా అదే అనుకుంటున్నారట. 2027లో సినిమా విడుదల కావొచ్చని ఓ అంచనా. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత రాజమౌళి ఏ హీరోతో పనిచేస్తారు? అనేది ఇప్పుడు ఫిల్మ్‌వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. నెక్ట్స్ అల్లు అర్జున్‌తో రాజమౌళి సినిమా ఉంటుందని కూడా ఓ టాక్ నడుస్తుంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తర్వాత సినిమా ప్రభాస్‌తో ఉంటుందట. దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందని తెలిసింది.
ఆర్కా మీడియా అధినేతలకు ‘బాహుబలి’కి ముందే రాజమౌళి రెండు కథలు చెప్పారట. అందులో ఒకటి ‘బాహుబలి’ కాగా, రెండోది బాక్సింగ్ నేపథ్యంతో సాగే కథ. ‘బాహుబలి’ బడ్జెట్ ఎక్కువ అనుకుంటే రెండో కథతో వెళదామన్నారట రాజమౌళి. కానీ అర్కా అధినేతలు ‘బాహుబలి’కే ఓటు వేశారు. ఆ సినిమా విడుదలై ఇండియన్ రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రెండో కథ అలాగే సిద్ధంగా ఉంది. ‘గ్లోబ్ ట్రాటర్’ తర్వాత ఈ సినిమానే పట్టాలెక్కించాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇప్పటికే ఆ కథ విన్న ప్రభాస్.. సినిమా చేసేందుకు సుముఖంగా ఉన్నారట. ఈ సినిమాపై క్లారిటీ రావాలంటే ‘గ్లోబ్ ట్రాటర్’ విడుదల కావాలి.