న్యూఢిల్లీ: భారతీయ వాతావరణ శాఖ(IMD) కీలక అంశాన్ని వెల్లడించింది. జూన్ నెలలో ఆశించినంతగా వర్షాలు పడలేదని తెలిపింది. ఈ నెలలో సగటున 20 శాతం తక్కువగా వర్షం నమోదు అయినట్లు ఐఎండీ పేర్కొన్నది. జూన్ ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు కేవలం 64.5 ఎంఎం వర్షం మాత్రమే కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. వాస్తవానికి ఆ లాంగ్ పీరియడ్లో సగటున 80.6 ఎంఎం కురవాల్సి ఉంది. కానీ జూన్ ఒకటో తేదీన నైరుతీ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించిన తర్వాత వర్షం నిలిచిపోయింది. జూన్ 12 నుంచి 18 మధ్య కాలంలో.. అనుకున్న స్థాయికి వర్షం కురవలేదని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఒడిశా, కోస్టల్ ఆంధ్ర, బే ఆఫ్ బెంగాల్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం నైరుతీ ముందుకు కదులుతున్నట్లు తెలిసింది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వర్షాలు కురవనున్నాయి.