వరంగల్‌చౌరస్తా, జూలై 14 : స్వలాభం కోసం సభ్యుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్సర్స్ అసోసియేషన్ కమిటీ వ్యవహార శైలిని నిరసిస్తూ దాని నుంచి వైదొలగాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ప్రకటించారు. మంగళవారం వరంగల్‌లోని ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షులు గోనెల రవీందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో సభ్యుల సంక్షేమాన్ని విస్మరించి, స్వలాభం కోసం మాత్రమే రాష్ట్ర కమిటీ పని చేస్తున్నట్లు వారు ఆరోపించారు.
రాష్ట్ర కమిటీతో కలిగివున్న అన్ని రకాల సభ్యత్వాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గత పదిహేనేళ్లుగా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గంపా నాగేంద్రనాధ్ ఆధ్వర్యంలో పని చేస్తూ వస్తున్న కమిటీలు మిల్లర్స్ సంక్షేమాన్ని, ప్రయోజనాలను పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ప్రభుత్వంతో సమన్వయం పేరుతో మిల్లర్ల తరపున ప్రాతినిధ్యం వహించిన ప్రతిసారి సభ్యులను తప్పుదోవ పట్టిస్తూ మిల్లర్ల సంక్షేమాన్ని తాకట్టు పెడుతూ వస్తున్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల మెడపై కత్తిలా మారిన అనేక ప్రభుత్వ ఉత్తర్వులు వారి నిర్లక్ష్యం మూలంగా అమలులోకి తీసుకువచ్చినవేనని అన్నారు.
తమ వ్యక్తిగత పలుకుబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారిన మిల్లర్లను అప్పుల పాలు చేస్తున్న రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొనసాగకూడదని ఉమ్మడి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసిందని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు తోట సంపత్‌కుమార్, ముఖ్యసలహాదారులు ప్రభాకర్‌రావు, దుబ్బ రమేశ్, ప్రధాన కార్యదర్శి బూరెల సత్యనారాయణ, కోశాధికారి ఇరుకుల కోటేశ్వర్రావు, హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌కుమార్, మాటేటి రాధిక ప్రదీప్చంద్రా, ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి జీ.శంకర్‌రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు వినయ్, ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌడ్, హనుమకొండ జిల్లా బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పొలసాని వెంకటేశ్వర్రావు, జగన్రావు, తదితరులు పాల్గొన్నారు.