నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు.నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో సుమారు 150 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం, కొత్తగూడెం గ్రామాలలోని వివిధ పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్లో చేరినందుకు అభినందించారు. సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం అనేక సమస్యలతో సతమత మయ్యేదని అన్నారు.
ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు, విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తరువాత సాగునీరు, విద్యుత్ సమస్య పూర్తిగా తొలిగిపోయిందని అన్నారు. దీంతో తెలంగాణ పచ్చని పంటపొలాలతో కళకళలాడుతుందని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.