గద్వాల, అక్టోబర్ 31 : పైసా ఖర్చు లేకుండా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జోగుళాంబ గద్వాల దవాఖానలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం రోగులకు మెరుగైన సేవలు అందించి పేదల ఆరోగ్యానికి బాసటగా నిలుస్తున్నది. జనవరిలో ట్రయల్ రన్ నిర్వహించగా పూ ర్తిస్థాయి వైద్య పరీక్షలు జూలై నుంచి ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోనే అత్యధిక రోగ నిర్ధారణ పరీక్షలు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. ఈ నిర్ధారణ కేంద్రం ఏర్పాటుతో ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన వెతలు ప్రజలకు తీరాయి. దీనికితోడు వేలకు వేలు ఖర్చు కూడా మిగిలిపోయినట్లే.. తక్కువ సమయంలో కచ్చితమైన ఫలితాలు అందిస్తుండడంతో ప్రజలు రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడానికి ప్రభుత్వ దవాఖానల వైపు పరుగులు తీస్తున్నారు. శాంపిల్ సేకరించిన 24 గంటల్లోనే రోగుల ఫోన్ నంబర్లకు పరీక్షల ఫలితాలను సిబ్బంది పంపిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
10 నెలల్లో 1,28,445 టెస్టులు
గద్వాల జిల్లా దవాఖానలో డయాగ్నోస్టిక్ సెంటర్లో జనవరిలో ట్రయల్ రన్ నిర్వహించి పరీక్షలు ప్రారంభించారు. జూలై నుంచి పూర్తిస్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. పరీక్ష కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం కోసం వచ్చిన వారి నుంచి వ్యాధి నిర్ధారణకు అవసరమైన శాంపిల్స్ సేకరించడంతోపాటు వనపర్తి జిల్లా దవాఖాన నుంచి వచ్చిన శాంపిల్స్‌ను ఇక్కడి ల్యాబ్‌లో పరీక్షలు చేశారు. మొత్తం 47,047 మంది రోగుల నుంచి 92,945 శాంపిల్స్ సేకరించి 1,28,455 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఎ క్కువగా సీబీపీ (రక్త కణాలు) 35,575 టెస్టు లు, లివర్‌కు సంబంధించి 10,432, కొవ్వుకు సంబంధించి 6,868 టెస్టులు, షుగర్ టెస్టులు 18,348, కిడ్నీకి సంబంధించి 11,022 టెస్టులు, డెంగీకి సంబంధించి 1,830, ప్రెగ్నెన్సీ టెస్టులకు సంబంధించి 4,289, టైఫాయిడ్‌కు సంబంధించి 524, థైరాయిడ్‌కు 23,880 టెస్టులు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన శాంపిల్స్‌ను జిల్లా డయాగ్నోస్టిక్ సెంటర్‌కు తీసుకరావడానికి మూడు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు.
ఉచితంగా 57 రకాల పరీక్షలు
క్షేత్రస్థాయిలో ప్రజలకు సంబంధించి వ్యాధులను గుర్తించి వాటిని నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జిల్లా దవాఖానలో తెలంగాణ డయాగ్నోస్టిక్ పేరుతో రోగనిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందులో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసి 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. పరీక్షల్లో సీబీపీ, గ్లూకోలెవల్స్ టెస్ట్, థైరాయిడ్, రక్తకణాలకు సంబంధించి, ఎల్ఎఫ్టీ, లిపిడ్ ప్రొఫైల్, ఆర్ఎఫ్టీ, టైఫాయిడ్, ఆర్పీఆర్, షుగర్, హెచ్‌బీఏ 1సీ, క్యాల్షియం, చికున్‌గున్యా, ఆర్బీఎస్, పీఎల్బీఎస్తో పాటు మరిన్ని రోగాలకు సంబంధించి టెస్టులు చేయనున్నారు.
రాష్ట్రంలోనే మొదటి స్థానం
జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ రోగనిర్ధారణ పరీక్షలు చేయడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రోగులకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం ఉచిత రోగ పరీక్షలు చేస్తుండడంతో స్పందన లభిస్తున్నది. రోగనిర్ధారణ కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి అక్టోబర్ వరకు 1,28455 టెస్ట్‌లు చేసి రోగులకు రిపోర్ట్స్ అందజేశాం. పీహెచ్‌సీల నుంచి సేకరించిన నమూనాలకు సంబంధించిన రిపోర్ట్‌ను 24 గంటల్లో అందజేస్తున్నాం.