బౌద్ధనగర్, జనవరి 22: హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ కనెక్ట్‌ను శనివారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగుల నుంచి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ముందుగా ఉదయం 11 గంటల నుంచి పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మారావునగర్ చౌరస్తాలో, అనంతరం, సీతాఫల్మండి చౌరస్తాలో సాయంత్రం నాలుగు గంటల వరకు మేళా నిర్వహించారు. దాదాపు 100 మంది నిరుద్యోగులు తమ రెస్యూమ్‌ను సిబ్బందికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెస్యూమ్‌లను పలు కంపెనీలకు పంపుతామని నిర్వాహకులు చెప్పారు. అర్హులైన వారికి కంపెనీలు ఫోన్, కాల్ లెటర్ల ద్వారా ఇంటర్వ్యూలు చేపడతారని చెప్పారు. ఈ జాబ్ కనెక్ట్ వ్యాన్ ఫిబ్రవరి 1వ తేదీ వరకు నార్త్ జోన్ పరిధిలో జాబ్ కనెక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుందని వివరించారు. ఆదివారం మార్కెట్ పోలీస్ స్టేషన్, సోమవారం గోపాలపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో జాబ్ కనెక్ట్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో చిలకలగూడ కానిస్టేబుళ్లు పవన్ రెడ్డి, ముఖేష్‌లతో పాటు జాబ్ కనెక్ట్ సిబ్బంది కేశవ్ పాల్గొన్నారు.