శ్రీనగర్, అక్టోబర్ 8: పదేండ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి జై కొట్టారు. 90 స్థానాలకు గానూ 49 స్థానాలను గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ 29 సీట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. ఏకంగా 42 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌కు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు ఉన్నప్పటికీ కేవలం ఆరు స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. 2014లో బీజేపీతో కలిసి అధికారాన్ని చేపట్టిన పీడీపీ ఈసారి దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్నది. అప్పుడు 28 సీట్లు గెలిచిన ఆ పార్టీకి ఇప్పుడు కేవలం మూడు స్థానాలే దక్కాయి. ఇండియా కూటమి భాగస్వామిగా సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకుంది. స్వతంత్రులు, వేర్పాటువాద అనుకూల నాయకులు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకొని ఖాతా తెరిచింది.
జమ్ము ప్రాంతానికే బీజేపీ పరిమితం
జమ్ము కశ్మీర్లో అధికారంపై కన్నేసిన బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఆ పార్టీ 62 స్థానాల్లో పోటీ చేసి 29 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2014లో 25 సీట్లు గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు నాలుగు స్థానాలను పెంచుకుంది. అయితే, బీజేపీ కేవలం జమ్ము ప్రాంతానికే పరిమితమైంది. గెలిచిన 29 స్థానాలూ ఇక్కడివే. కశ్మీర్ లోయలో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని సైతం గెలుచుకోలేకపోయింది. కశ్మీర్ ప్రాంతంలో 20 మందికి పైగా బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. బీజేపీ జమ్ము కశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనాతో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఓటమి చవిచూశారు.
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. పొత్తులో భాగంగా 32 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఆరు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. గత ఎన్నికల్లో 12 స్థానాలు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు ఆరు స్థానాలను కోల్పోయింది. జమ్ము ప్రాంతంలో అయితే కాంగ్రెస్‌కు చేదు ఫలితాలు వచ్చాయి. జమ్ములో 29 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రాజౌరి స్థానాన్ని మాత్రమే 1,404 ఓట్ల మెజార్టీతో గెలవగలిగింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి తారాచంద్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లాతో పాటు పలువురు కీలక నేతలు ఓటమి చవిచూశారు.
మరోసారి సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ఇండియా కూటమికి మ్యాజిక్ ఫిగర్ రావడంతో ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నట్టు ఆయన తండ్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. ప్రస్తుతం నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి 2014 మధ్య జమ్ము కశ్మీర్ సీఎంగా పని చేశారు. 1999 నుంచి 2002 వరకు కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు.
వేర్పాటువాదుల తిరస్కరణ
వేర్పాటువాదిగా ముద్రపడి లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఇంజినీర్ రషీద్ ప్రభావం ఈ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదు. ఆయన నేతృత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీతో పాటు వేర్పాటువాద అనుకూల జమాతే ఇస్లామీ ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నాయి. అవామీ ఇత్తెహాద్ 44 స్థానాలకు పోటీ చేయగా, జమాతే ఇస్లామీ నాలుగు స్థానాల్లో పోటీ చేసి, మరో నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు తెలిపింది. అయితే. కుల్గాం నుంచి జమాతే ఇస్లామీ మద్దతు ఇచ్చిన సయర్ అహ్మెద్ రెషీ, లంగేట్ నుంచి ఎంపీ ఇంజినీర్ రషీద్ సోదరుడు, అవామీ ఇత్తెహాద్ అభ్యర్థి కుర్షీద్ అహ్మద్ షేక్ మాత్రమే విజయం సాధించారు. ఉగ్రవాది అఫ్జల్ గురు సోదరుడు అజాజ్ అహ్మద్ గురుకు కేవలం 129 ఓట్లే వచ్చాయి.