PM Modi | న్యూఢిల్లీ, మార్చి 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది సాధిస్తున్నారు. ఇతర దేశాల సంగతెలా ఉన్నా.. భారత్ మాత్రం ట్రంప్ ఆంక్షలకు తలొగ్గింది. ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు ఉంటాయంటూ అగ్రరాజ్యాధినేత చేసిన హెచ్చరికలకు మోదీ సర్కారు బాగానే భయపడిపోతున్నది మరి. అమెరికా వస్తూత్పత్తులపై ఇప్పటికే దిగుమతి సుంకాలను మినహాయించడం లేదా తగ్గిస్తూ వచ్చిన కేంద్రం.. ఇప్పుడు అక్కడి టెక్ కంపెనీలకూ భారీ లాభాల్ని కట్టబెడుతూ డిజిటల్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ‘గూగుల్ ట్యాక్స్’గా పాపులరైన ఈ డిజిటల్ ట్యాక్స్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు చెప్పేశారు.
వేల కోట్లలో నష్టం
2016 జూన్ 1న ఆన్లైన్ అడ్వైర్టెజింగ్పై డిజిటల్ ట్యాక్స్ లేదా లెవలింగ్ ఫీ, ఈక్వలైజేషన్ లెవీని కేంద్రం తీసుకొచ్చింది. అంతేగాక 2020లో ఈ పన్ను పరిధిని మరింతగా విస్తరించింది. దేశీయంగా ఎలాంటి కార్యకలాపాలు లేకున్నా భారతీయ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆదాయాన్ని దక్కించుకుంటున్న గూగుల్, ఎక్స్, మెటా, అమెజాన్ తదితర విదేశీ డిజిటల్ సంస్థలే లక్ష్యంగా 6 శాతం పన్నును విధించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే దీనిద్వారా కేంద్రానికి దాదాపు రూ.3,343 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. అయితే ట్రంప్ సర్కారు తమ దేశ టెక్నాలజీ సంస్థలపై అడ్డగోలుగా భారత్ పన్నులు వేస్తోందని మండిపడుతున్నది. ప్రతీకార సుంకాల హెచ్చరికల సందర్భంగా ఈ విషయాన్ని నొక్కిచెప్పింది కూడా. ఈ నేపథ్యంలో ఆర్థిక బిల్లు 2025కి చేసిన 59 సవరణల్లో ఈ డిజిటల్ ట్యాక్స్‌ను ఎత్తివేస్తున్నట్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగగా, వచ్చే నెల మొదలు ఈ పన్నుకు బ్రేక్ పడనున్నది. ఇదే జరిగితే గూగుల్, మెటా, ఎక్స్, అమెజాన్ వంటి అమెరికా సంస్థలకు వేల కోట్ల రూపాయలు అప్పనంగా మిగిలినట్టే. ఇదే సమయంలో ఖజానా ఆదాయానికీ గండి పడ్డట్టే. నిజానికి లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి మాట్లాడుతూ.. గత ఏడాదే ఈ-కామర్స్ లావాదేవీలపై 2 శాతం లెవలింగ్ ఫీజును తొలగించామని, ఇప్పుడు ఆన్లైన్ ప్రకటనలపై పడుతున్న 6 శాతం డిజిటల్ ట్యాక్స్‌నూ ఎత్తివేస్తున్నామని గొప్పగా చెప్పుకొచ్చారు. తద్వారా మన చట్ట సభల నుంచే అమెరికాను మెప్పించే ప్రయత్నం మోదీ సర్కారు చేసేసింది.
ట్రంప్ భేటీలోనే..
గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 2030కల్లా ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అయితే మేము ప్రతీకార సుంకాలకు దిగితే భారత్‌పైనా ఆ ప్రభావం ఉంటుందని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో మోదీ.. వచ్చీరాగానే కొన్నింటిపై సుంకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుని కోతలు పెట్టారు.
నిపుణుల మాటేంటి?
భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న జనరిక్ ఔషధాలతో అమెరికన్ల వైద్య ఖర్చులు 60 నుంచి 70 శాతం తగ్గుతున్నాయని ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అలాంటప్పుడు వీటిపై సుంకాలు వేస్తే అక్కడి ప్రజానీకానికే ఇబ్బందని అంటున్నారు. ఇక అమెరికా ప్రయోజనాల కోసం మన ఆదాయాన్ని వదులుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని అంటున్నావారూ ఉన్నారు. ఐటీ, ఆటో, స్టీల్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, ప్రపంచ దేశాలు అమెరికాతో ఎలా వ్యవహరిస్తున్నాయో.. అలాగే భారత్ కూడా ఉండాలని సూచిస్తున్నారు.