తొగుట, ఏప్రిల్ 17 : తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజప్వీ సూర్య వ్యాఖ్యలతో తెలంగాణ పోరాటంలో ఆమరులైన వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని సిద్దిపేట జిల్లా తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. నిండు పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజన భారత్ నుండి పాకిస్తాన ను విభజన చేసిన విధంగా పోల్చడంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ గురించి ఏం తెలుసని తేజస్వీ సూర్య మాట్లాతున్నాడని, తెలంగాణ కోసం నాడు ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్ లు మద్దతివ్వగా నేటి తరం ప్రధాని మోదీ నుండి మొదలుకొని అమిత్ షా, నేటి తేజస్వీ సూర్య వరకు తెలంగాణకు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు.
తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటుపై విమర్శలు చేస్తుండగా, తెలంగాణ నుండి ప్రాతినిధ్య వహిస్తూ తెలంగాణ ఆత్మను ప్రతిభింభించాల్సిన కాంగ్రెస్, బీజేపీ కి చెందిన 16 మంది ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. తమిళనాడుపై తేజస్వీసూర్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండగానే పార్టీలకతీతంగా అక్కడి ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారని, వారికి ఉన్న రేషం, చేవ మన ఎంపీలకు లేదా అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు బోధనం కనకయ్య, సుతారి రమేష్, కుర్మ యాదగిరి, బండారు స్వామిగౌడ్, అరుణ్ కుమార్, బిక్షపతి, రాంబాబు, జహంగీర్, అంజియాదవ్, నవీన్ తదితరులున్నారు.