న్యూఢిల్లీ, జూన్ 3: సీబీఎస్ఈ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల అస్తవ్యస్త సమస్యల నుంచి విద్యార్థులు బయటపడక ముందే మరో పరీక్ష నిర్వహణ వైఫల్యం వెలుగుచూసింది. తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలకు సంబంధించి నిర్వాహకుల నిర్లక్ష్యం ఒకటి బయటపడింది. గత వారం ప్రకటించిన ఈ ఫలితాలకు సంబంధించి లక్షలాది మంది విద్యార్థుల రికార్డుల డాటా ఆన్లైన్లో లీకయ్యింది. అభ్యర్థుల రికార్డులు, అడ్మిట్ కార్డుల సమాచారం నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బహిర్గతమైంది. అభ్యర్థుల సమాచారం లీకైన విషయాన్ని ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించిన ఐఐటీ, రూర్కీ అంగీకరించింది.
క్లౌడ్ స్టోరేజ్ తప్పుడు కాన్ఫిగరేషన్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని వివరించింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలకు సంబంధించిన పబ్లిక్ క్లౌడ్ స్టోరేజి ప్రామాణీకరణ లేకుండానే అనియంత్రిత యాక్సిస్‌ను అనుమతిస్తున్నట్టు ఒక సైబర్ సెక్యూరిటీ రిసెర్చర్ ఎక్స్ ద్వారా ఐఐటీ దృష్టికి తీసుకువచ్చారు. దీని ద్వారా 1,79,600 మంది అభ్యర్థుల ఫలితాల రికార్డులు, 1,87,00 అడ్మిట్ కార్డు పీడీఎఫ్‌లు బహిరంగంగా యాక్సిస్ అవుతున్నాయని తెలిపారు. దీని ద్వారా అభ్యర్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్లుతో పాటు వారి సబ్జెక్టుల వారీ మార్కులు, ర్యాంకులు అంతా బట్టబయలైందనిఆయన తెలిపారు. అయితే బహిర్గతమైన ఈ డాటా రీడ్ ఓన్లీ రూపంలో ఉన్నందున వాటిని ఎవరూ మార్పు చేయలేరని ఐఐటీ రూర్కీ తెలిపింది.