వడ్లు కొనాలని ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం కరుగుతలేదు.. బీజేపీ ఎంపీలకు సోయిలేదా..
స్వరాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారి పుట్లకు పుట్లు వడ్లు పండుతుంటే వాటిని కొనకుండా కేంద్రం ఇక్కడి రైతులపై కక్షగట్టుడు ఎంతవరకు సబబని అన్నదాతలు మండిపడుతున్నారు. తెలంగాణలో ధాన్యం కొనాలని, ఎమ్మెస్పీపై చట్టం చేయాలని, ఢిల్లీ ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో మూడోరోజూ పట్టుబట్టి నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలకు జేజేలు కొడుతున్నరు. ‘వాళ్లు మాకోసం ఇంతగనం కొట్లాడుతున్నరు. తెలంగాణ రైతుల కోసం మనోళ్లు కొట్లాడుతుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలకు సోయిలేదా.. సప్పుడుజేస్తలేరు.. తెలంగాణ రైతులకు నష్టం కలుగుతాంటె కదలరు మెదలరా..? కేంద్రంల ఉన్నది వాళ్ల సర్కారేగద.. గట్టిగ అడగరాదా?’ అని దుమ్మెత్తిపోస్తున్నరు.
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భూమికి బరువయ్యేలా వడ్లు పండుతుంటే ఓర్వలేకనే కేంద్రం ఇక్కడి రైతులపై కక్షగట్టి వడ్లు కొంటలేదని అన్నదాతలు మండిపడుతున్నారు. తెలంగాణలో ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో మూడోరోజూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలకు జేజేలు కొడుతున్నరు. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు కొట్లాడుతుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలకు కనిపిస్తలేదా అని మండిపడుతున్నరు. ఆదినుంచీ రైతులకు అండగా ఉంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. అన్నదాతల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఈ క్రమంలో ప్రతి రైతు పొలంబాట పట్టి వరి పండించడంతో దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో ఇక్కడి రైతులకు ప్రోత్సాహకంగా ఉండాల్సింది పోయి వడ్లు కొనబోమని కేంద్రం తెగేసి చెప్పడం ఎంతవరకు సమంజసమని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు, పంటలకు మద్దతు ధరలపై గట్టిగా పట్టుబడుతున్నారు. తమ కోసం టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయరంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చేసిందని, ఇప్పుడు రైతుల సమస్యల కోసం పార్లమెంట్లో కొట్లాడుతోందని చెబుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు తమ కోసం పోరాడుతుంటే పార్లమెంట్లో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ విషయంలో దూరంగా ఉండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్ల కొనుగోలు, మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తేల్చాలనేది దేశంలోని ప్రతి ఒక్క రైతు డిమాండ్ అని, ఈ విషయంలో మన రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రైతులకు నష్టం జరుగుతుంటే ఇక్కడి బీజేపీ ఎంపీల తీరు దున్నపోతుపై వానపడ్డట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నరు.
మన ఎంపీలు భేష్
వర్ధన్నపేట : రైతులను ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తెలంగాణ రైతాంగం సంపూర్ణ మద్దతు ఉంటుంది. రైతు బాగు కోసం సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న కృషిని రైతాంగం ఎప్పటికీ మరిచిపోదు. వానకాలం వడ్లు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంతో పాటు యాసంగి ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనుగోలు చేయాలి. పార్లమెంట్లో కనీస మద్దతు ధర నిర్ణయించి చట్టాన్ని కూడా తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకూ తెలంగాణ రైతాంగం సంఘటితంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుంది.
బీజేపోళ్లకు ఏంబుట్టింది
ఎన్నో ఏండ్లు సాగునీరు లేక, చెలక పంటలు పండక కరువు అనుభవించినం. తెలంగాణ రాంగనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో మా పంట పొలాలకు నీళ్లచ్చినయ్. వడ్లు పండించుకొని పది పైసలు సంపాదించుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొననేకొనమని చెప్పుడు మంచిగలేదు. టీఆర్ఎస్ ఎంపీలు రైతుల కోసం పార్లమెంట్లో గట్టిగ కొట్లాడుతాంటె బీజేపోళ్లకు ఏంబుట్టింది. కేంద్రంల ఉన్నది వాళ్ల సర్కారేనాయె. వడ్లు కొనాలని వాళ్ల నాయకులను అడుగరాదా..? నోళ్లు మూస్కొని కూసుంటున్రు. ఇప్పటికైనా కేంద్రం వడ్లు కొంటెనే సరి.. లేకుంటె రైతులమంతా కలిసి రోడ్లమీదికెక్కుతం.
బీజీపీకి మా గోస తాకుతది..
కృష్ణకాలనీ : పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్నది న్యాయపోరాటం. టీఆర్ఎస్ రైతుల పక్షపాతి అనడానికి వారు తెలుపుతున్న నిరసనలే నిదర్శనం. మూడు రోజుల నుంచి రైతులమంతా చూస్తున్నం. అయినా కనీకరం లేకుండా బీజేపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. వడ్లు కొనమని చెప్పడం బాధగా ఉంది. రైతుల కల్లాల వద్దకు వచ్చి కపట ప్రేమను చూపించే కాంగ్రెసోళ్లు.. మా కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలకు ఎందుకు మద్దతిస్తలేరు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి యాసంగి పంట కొనాలె. లేకుంటే రైతుల గోస తాకుతది.
కొనమనుడు పద్ధతి కాదు..
కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అనుకూల విధానాలు, సాగునీటి వసతితో వరి దిగుబడి బాగా పెరిగింది. దీనికి అనుగుణంగా రెండు పంటలు వరి ధాన్యాన్ని కొనాల్సిన కనీస బాధ్యత కేంద్రంపై ఉంది. వరిపై పర్మనెంట్ పాలసీని ప్రవేశపెట్టాలి. కొనమని చెప్పడం పద్ధతి కాదు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలు రైతుల పక్షాన నిలిచి పోరాడుతున్న తీరు సమర్థనీయం. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆయోమయానికి గురిచేస్తుండడంతో కేసీఆర్ తెలంగాణ రైతుల పక్షాన నిలిచి పోరాడుతున్నారు.
పంజాబ్ లెక్క మా వడ్లు కొనాలె
నేను 20 ఏండ్ల సంది ఎవుసాయం చేత్తాన. వానకాలం, యాసంగిలోనా సొంత పొలం కలుపుకొని ఇంకింత కౌలుపట్టి వడ్లు పండిత్తాన. వడ్లు అమ్ముకునేటపుడు ఎప్పుడు కూడ ఇసొంటి ఆగం కథ లేకపోయేది. తెలంగాణ సర్కార్ అచ్చినంక ఎవుసం జర అలుకగైంది. ఇప్పుడు యసంగి వడ్లు కొనమని బీజేపోళ్లు చెప్పుడు మంచిగ లేదు. పంజాబ్ కాడా వడ్లు కొంటాండ్లట. మనకాడ కూడా వడ్లుకొని రైతులకు సాయం చేయాలె. కేసీఆర్ సార్కు అన్ని పార్టీలోల్లు సపోర్టుగా నిలవడాలె. రైతులు రోడ్లు ఎక్కకముందే ఎనుకటి లెక్కనే యాసంగిలో వడ్లు కొనాలె.
టీఆర్ఎస్కు మద్దతలియ్యాలె..
ఎన్కటి లెక్కనే వడ్లు మొత్తం కొని రైతుల బ్యాంకుల్ల పైసలు ఎయ్యాలె. వడ్లు కొనమని చెప్పుడు ఎంతవరకు కరెక్టు. రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగనే పోరాటం చేస్తున్నరు. కానీ కేంద్ర ప్రభుత్వం కక్షకట్టి రైతులపై కుట్ర చేసి వడ్లు కొనమని చెప్పుడు మంచిగ లేదు. మోడీ సర్కార్ ఒక కాడ వడ్లు కొని ఇంకో కాడ కొనమనుడేంది. అక్కడా ఇక్కడా వడ్లు పండించేది రైతులే కదా. గిట్ల గోసవెట్టుడు మంచిది కాదు. వడ్లు కొనాలని రైతుల కోసం టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు ఇయ్యాలె.
బీజేపీ, కాంగ్రెసోళ్లను నిలదీయాలె..
మహబూబాబాద్ డిసెంబర్ 1 (నమస్తేతెలం గాణ) : రాష్ట్రవ్యాప్తంగా రైతులు సాగుచేస్తున్న వరి ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేయాలి. వడ్లు కొనుగోలు చేయాల్సిన బాధ్యత వాళ్లదే. అది మరచి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టివే యడం సరైనది కాదు. మొన్నటినుంచి పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మద్దతు ఇవ్వాలి. రైతుల సమస్యల పరిష్కారం కోసం ముందుకు రాని ఎంపీలను ప్రజలందరు ఎక్కడికక్కడ నిలదీయాలి. కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.
పోరాటం హర్షణీయం..
ఏటూరునాగారం : అన్నదాతలు ఆగం కాకుండా రైతుల మేలు కోరి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు వద్ద ధర్నా చేయడం హర్షణీ యం. టీఆర్ఎస్ సర్కారు.. రైతు పక్షపాతి అనే విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. ధాన్యం కొనుగోలు, వరి పంటపై ఆంక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగట్టాల్సిన ప్రతి పక్షాలు పట్టించుకోకపోవడం శోచనీయం. టీఆర్ఎస్ మొదటినుంచి రైతు వెన్నంటే ఉంది. – సరికొప్పుల వెంకటేశ్వర్లు, ఏటూరునాగారం