Jaitley | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రకమైన వివాదం చెలరేగింది. ‘పర్సంటేజీ’ సిస్టమ్ చుట్టూ తిరుగుతున్న ఈ సమస్య ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించిన తాజా చిత్రం ‘జెట్లీ’ ప్రదర్శనపై నేరుగా ప్రభావం చూపుతోంది. తెలంగాణలోని ఎగ్జిబిటర్లు, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ల మధ్య నెలకొన్న ఈ విభేదాలు మల్టీప్లెక్స్‌ల వరకు విస్తరించడంతో పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్స్, రెవెన్యూ షేరింగ్ (పర్సంటేజీ) విషయంలో నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్ల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. తమ షరతులకు అంగీకరిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు కఠినంగా వ్యవహరిస్తుండగా, పర్సంటేజీ విధానాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రీ సంస్థకు చెందిన సినిమాలను సింగిల్ స్క్రీన్లలో నిలిపివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
సింగిల్ స్క్రీన్ సమస్య కొనసాగుతున్నప్పటికీ, సంబంధం లేని మల్టీప్లెక్స్‌లలో కూడా ‘జెట్లీ’ ప్రదర్శనను ఆపివేయడంపై మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ప్రతినిధి కేతిరెడ్డి శశిధర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎగ్జిబిటర్ల సంఘానికి లేఖ రాస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సింగిల్ స్క్రీన్ సమస్యను పరిష్కరించేందుకు మల్టీప్లెక్స్‌లను ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం సరికాదని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌ల విషయంలో ఎలాంటి విభేదాలు లేనప్పటికీ అక్కడ కూడా ప్రదర్శన నిలిపివేయడం వ్యాపార ధర్మానికి విరుద్ధమని అన్నారు. చర్చలకు ఎప్పుడూ సిద్ధమని, సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సూచించారు.
‘జెట్లీ’ వంటి చిన్న సినిమాలకు థియేటర్ల మద్దతు ఎంతో కీలకం. మైత్రీ వంటి పెద్ద సంస్థ పంపిణీ చేస్తున్నప్పటికీ, ఈ వివాదం కారణంగా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఇక ఎగ్జిబిటర్లు మల్టీప్లెక్స్ చైన్స్‌ను కూడా ప్రభావితం చేయడం డిస్ట్రిబ్యూషన్ రంగంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఇప్పుడైనా ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాయా? లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? అన్నది చూడాలి.