Oscar Awards | ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నిలిచిన అకాడమీ అవార్డ్స్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అకాడమీ సంస్థ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంపై తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమా నిర్మాణంలో ఏఐ వినియోగం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇది ఒకవైపు పనిని సులభతరం చేసినప్పటికీ, అసలైన సృజనాత్మకతను తగ్గించే ప్రమాదం ఉందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏఐతో రూపొందించిన విజువల్స్‌ను సులభంగా గుర్తించగలుగుతున్న నేపథ్యంలో, నిజమైన కంటెంట్ విలువ తగ్గిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో అకాడమీ సంస్థ ఏఐ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ఏఐ ఆధారంగా రూపొందించిన కంటెంట్‌ను అవార్డుల పోటీలో అనుమతించకుండా నియంత్రణలు విధించాలని నిర్ణయించింది. ఈ చర్యతో అసలు సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలని అకాడమీ సంకేతాలు ఇచ్చింది. ఇక నామినేషన్ల విషయంలో కూడా కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఒకే దేశం నుంచి ఒకేసారి ఎన్నో సినిమాలు పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. అలాగే ఒకే నటుడు ఒకేసారి పలుసినిమాల ద్వారా ఒకే విభాగంలో నామినేట్ అయ్యే అవకాశం కూడా ఇవ్వడం విశేషం.
ఈ మార్పులు క్రియేటర్స్‌కు మరింత అవకాశాలు కల్పిస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొత్త ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం పెరుగుతుందని అంటున్నారు. అయితే ఏఐపై విధించిన నియంత్రణలు చాలా మంది నిజమైన కంటెంట్ సృష్టికర్తలకు ఊరటనిచ్చాయి. ఇటీవల కొన్ని ప్రాంప్ట్లతోనే భారీ స్థాయి సినిమాలను రూపొందించడం పెరిగిపోవడంతో, అసలైన సృజనాత్మకతకు ముప్పు ఏర్పడింది. దీనిపై అకాడమీ తీసుకున్న నిర్ణయం సరైన దిశలో అడుగుగా భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు 2027లో జరగనున్న 99వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భవిష్యత్తులో సినీ రంగంలో సృజనాత్మకత, నాణ్యతకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.