Peddi | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్దిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్‌తో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. రీసెంట్గా చిత్ర బృందం నిర్వహించిన మొదటి ప్రెస్ మీట్లో కీలక ప్రకటన వెలువడింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు బుచ్చిబాబు సానతో పాటు సుకుమార్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు మరియు చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమాను జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్ 3న రాత్రి ప్రీమియర్ షోలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రెస్ మీట్లో నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను ఎవరో కూడా తెలియని సమయంలోనే ఆయన ఈ సినిమా అవకాశం ఇచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా అవుట్‌పుట్‌పై చాలా సంతృప్తిగా ఉన్నాను” అని చెప్పారు. షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ప్రతిరోజూ చరణ్ గారు తన ఇంటి నుంచి భోజనం పంపించి, మాతో కలిసి కూర్చొని తినేవారు. నిన్నే షూటింగ్ చివరి రోజు, ఆ రోజూ కూడా కలిసి భోజనం చేశాం. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఈ సినిమా మేకింగ్ ప్రయాణం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అని తెలిపారు.
ఈ చిత్రం ఎమోషనల్ కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని నిర్మాత నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తానికి ‘పెద్ది’ రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.