న్యూఢిల్లీ : జహింగీర్‌పురి హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనలో ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. హింసాత్మక ఘటన అంతర్జాతీయ కుట్ర అని బీజేపీ ఎంపీ హన్సరాజ్ ఆరోపించారు. భారత దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని, బయటి శక్తులకు సహాయం చేస్తున్న వ్యక్తులు కొందరు దేశంలోనే ఉన్నారన్నారు. ఘటన పూర్తిగా ప్రణాళికా ప్రకారమే జరిగిందని, ఈ వ్యవహారంపై ఎన్ఐఏతో విచారణ జరిపించాలని హన్సరాజ్ డిమాండ్ చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్‌పురిలో జరిగిన హింసాకాండకు ఏ మతాన్ని నిందించలేమని, కేవలం ఇది అంతర్జాతీయ కుట్రేనన్నారు. ఘటనాస్థలంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారని, హోంమంత్రి అమిత్‌షా ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నారని ఎంపీ చెప్పారు. కాగా, ఎంపీ హన్స్ రాజ్ వాయువ్య ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో వైపు సంఘటనా స్థలాన్ని ఢిల్లీ బీజేపీ నేతలు అదేష్ గుప్తా, రామ్‌వీర్ సింగ్ బిధురి సందర్శించారు.
ఇదిలా ఉండగా.. పోలీసులు అమన్ కమిటీతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిటీ సభ్యులు తమ తమ ప్రాంతాల ప్రజలు శాంతి, సామర్యాలను కాపాడాలని కోరారు. ఎలాంటి తప్పుడు సమాచారంపై స్పందించొద్దని, వాటిని నమ్మొద్దన్నారు. సంఘటన వ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మరో వైపు జహంగీర్‌పురి హింసాకాండ నేపథ్యంలో మరో 5 సీఆర్పీఎఫ్ కంపెనీలను మోహరించినట్లు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.