
హైదరాబాద్/ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌ల తయారీ సంస్థ ‘డ్రిల్మెక్-ఎస్పీఏ’ హైదరాబాద్‌లో రూ.1500 కోట్లు (200 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇది నగరానికి చెందిన ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్’ (మెయిల్) గ్రూప్‌లో ఒక భాగం. డ్రిల్మెక్ కంపెనీని 2019-20లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ట్రెవీ గ్రూపు నుంచి ప్రెటివెన్ సంస్థతో కలిసి కొనుగోలు చేసింది. దీంతో డ్రిల్మెక్ కంపెనీ మేఘాకు అనుబంధ సంస్థగా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించనున్నది. సంస్థ అంతర్జాతీయ తయారీ కేంద్రాన్ని (ఇంటర్నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్) నెలకొల్పనున్నది.
ఇందులో డ్రిల్లింగ్ రిగ్‌ల తయారీ కోసం ప్రత్యేక యూనిట్, పరిశోధనల కోసం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, యువతకు శిక్షణ ఇచ్చేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నది. సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డ్రిల్మెక్-ఎస్పీఏ సీఈవో సిమోనే ట్రెవిసాని ఒప్పంద పత్రాలు మార్చుకొన్నారు. ఈ సందర్భంగా సిమోనే మాట్లాడుతూ, అనేక దేశాలు ఆహ్వానించినా.. తెలంగాణ విధానాలు, హైదరాబాద్‌లోని ఎకోసిస్టమ్ నచ్చి తమ యూనిట్‌ను ఇక్కడే నెలకొల్పుతున్నామని తెలిపారు. ఇక్కడ రిగ్‌ల ఉత్పత్తితోపాటు పరిశోధనలపైనా దృష్టిపెడుతామన్నారు.
భవిష్యత్తులో పూర్తిగా ఆటోమెటిక్‌గా నడిచే రిగ్గులు, హైడ్రోజన్ ఇంధనం ఉత్పత్తి చేసేలా యంత్రాలను రూపొందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తాము ఇప్పటి వరకు 600 డ్రిల్లింగ్ రిగ్గులను ఉత్పత్తి చేశామన్నారు. సంస్థ ఇంటర్నేషనల్ సీఈవో ఉమామహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రిల్మెక్కు అంతర్జాతీయంగా రూ.7,500 కోట్ల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్‌ను తట్టుకొనేలా తెలంగాణలో వీలైనంత త్వరగా యూనిట్‌ను ఏర్పాటు చేసి, ఉత్పత్తి మొదలు పెడతామన్నారు.
ఇది కేసీఆర్ ప్రభుత్వ విజయం: కేటీఆర్
తమ ప్రాంతంలో యూనిట్‌ను ఏర్పాటు చేయాలంటూ డ్రిల్మెక్కు అనేక దేశాలు, మన దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి ఆహ్వానం అందినా తెలంగాణను ఎంచుకొన్నందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎలాంటి తీర ప్రాంతం లేని భూపరివేష్టిత రాష్ట్రమని (ల్యాండ్ లాక్డ్ స్టేట్), పైగా ఎక్కువగా చమురు, సహజ వాయువు వంటివి లభించే అవకాశం కూడా లేదన్నారు. అయినా డ్రిల్మెక్ సంస్థ ఇతర దేశాలు, అనేక రాష్ర్టాల ఆహ్వానాలను కాదని, తెలంగాణలో 200 మిలియన్ డాలర్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తుండటం తెలంగాణకే గర్వకారణమని చెప్పారు.
ఇటలీకి చెందిన ఈ సంస్థకు ఇటలీ, అమెరికా, బెలరూస్‌లో మూడు యూనిట్లు ఉన్నాయని, ఆ తర్వాత నాలుగో యూనిట్ హైదరాబాద్‌లోనే నెలకొల్పుతున్నదని తెలిపారు. ఇది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సమర్థమైన ప్రభుత్వం సాధించిన విజయంగా అభివర్ణించారు. సీఎం కేసీఆర్ విజన్ ప్రకారం తెలంగాణను పారిశ్రామిక అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడున్నరేండ్లుగా కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో టీఎస్ఐపాస్తోపాటు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం టాప్‌లో నిలిచిందన్నారు. దీంతో గత ఏడున్నరేండ్లలో అనేక తయారీ కంపెనీలు తరలివచ్చాయని తెలిపారు. డ్రిల్మెక్ వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభం అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ యూనిట్‌తో 2,500 మందికి ఉపాధి లభిస్తుందని, ఇందులో 80-90 శాతం తెలంగాణ యువత ఉండేలా చూడాలని సూచించారు.