Gatta Kusthi 2 | తమిళ హీరో విష్ణు విశాల్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన ‘గట్టా కుస్తీ 2’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. గతంలో మంచి విజయాన్ని అందుకున్న ‘గట్టా కుస్తీ’ చిత్రానికి సీక్వెల్‌గా దర్శకుడు చెల్ల అయ్యవు రూపొందించిన ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రెండో వారంలోనూ అదే జోరును కొనసాగిస్తోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్ నుంచి కూడా మంచి ఆదరణ లభించడంతో సినిమా విజయోత్సాహంలో చిత్రబృందం ఉంది.
సినిమా విజయాన్ని పురస్కరించుకుని చెన్నైలో చిత్ర యూనిట్ గ్రాండ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ, వారికి ప్రత్యేక బహుమతులు అందించారు. సినిమా కోసం కష్టపడ్డ యూనిట్ సభ్యులందరికీ 40 గ్రాముల వెండి నాణేలు అందజేయగా, దర్శకుడు చెల్ల అయ్యవుకు 10 గ్రాముల బంగారు గొలుసుతో పాటు గోల్డ్ బ్రాస్లెట్ బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణ హీరో విష్ణు విశాల్‌కి అందించిన విలాసవంతమైన కారు. సినిమా విజయానికి గుర్తుగా నిర్మాత ఆయనకు సుమారు రూ.1 కోటి విలువైన BMW 3 సిరీస్ లగ్జరీ కారును గిఫ్ట్‌గా అందజేశారు. ఈ సర్ప్రైజ్తో విష్ణు విశాల్ ఆనందం వ్యక్తం చేయగా, అక్కడున్న యూనిట్ సభ్యులు చప్పట్లతో అభినందించారు.
ప్రస్తుతం ఈ గిఫ్ట్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత ఉదారతను నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘గట్టా కుస్తీ’ మొదటి భాగం తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో విడుదలై మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, వినోదం, కుటుంబ భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగం కూడా తమిళంలో విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో, దీనిని తెలుగులో కూడా విడుదల చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. అయితే తెలుగు విడుదలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంచి మౌత్ టాక్‌తో రెండో వారంలోనూ థియేటర్లలో బలంగా కొనసాగుతున్న ‘గట్టా కుస్తీ 2’ మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.