భోపాల్: డ్రగ్స్ కేసులో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సోదరుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరొకరిని ప్రశ్నించిన తర్వాత విడిచిపెట్టారు. అయితే ఇది బూటకపు కేసు అని, అధికార బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆ కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు. (MP Congress Chief’s Brother Detained) గురువారం ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఇర్ఫాన్ ఖాన్ అలియాస్ గోలు చందేరి, సంజయ్ కౌశల్ అలియాస్ రోనీ భాయ్‌ను ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న 10.8 గ్రాముల బ్రౌన్ షుగర్, ఎస్యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా, ఆ ఇద్దరు నిందితులను పోలీసులు ప్రశ్నించగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ తమ్ముడు నానా పట్వారీ అలియాస్ కుల్‌భూషణ్ పట్వారీ, మానవ్ గంగ్వానీ అనే ఇద్దరు వ్యక్తులకు బ్రౌన్ షుగర్ అందజేయడానికి వెళ్తున్నట్లు వారు చెప్పారని డీసీపీ నరేంద్ర రావత్ తెలిపారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు చెప్పారు. అరెస్టైన నిందితులతో వారికి ఉన్న సంబంధాలు, ఇతర ఆధారాల గురించి ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన తర్వాత వారిని విడుదల చేసి వారి న్యాయవాదికి అప్పగించినట్లు వివరించారు. అవసరమైతే నానా పట్వారీ, గంగ్వానీలను తదుపరి విచారణకు పిలుస్తామని డీసీపీ అన్నారు. నానా పట్వారీపై ఇప్పటి వరకు తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
మరోవైపు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ దీనిపై స్పందించారు. తన తమ్ముడు నానాను ఒక బూటకపు కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. సీఎం మోహన్ యాదవ్‌కు ఈ మేరకు ఒక లేఖ రాశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన సోదరుడిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇండోర్ పోలీసులు ఒక రాజకీయ సంకేతాన్ని పంపారని ఆయన పేర్కొన్నారు. చట్టపరమైన ఒత్తిడి, రాజకీయ ప్రభావంతో భయపెట్టే చర్యలకు కాంగ్రెస్ వెనక్కి తగ్గదని, మరింత ఉధృతంగా పోరాడుతుందని జితు పట్వారీ స్పష్టం చేశారు.