న్యూయార్క్: ఒకవేళ తనకు నోబెల్ శాంతి పురస్కారం దక్కకుంటే, అప్పుడు అది అమెరికాకు అతిపెద్ద అవమానం జరిగినట్లు అవుతుందని డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. గాజా సంక్షోభం గురించి మాట్లాడుతున్న సమయంలో.. శాంతి ఒప్పందం కుదిరిందని భావిస్తానని, హమాస్ దానికి ఒప్పుకుంటుందో లేదా చూస్తానని, ఒకవేళ ఒప్పుకోకుంటే, అప్పుడు వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుందని, అన్ని అరబ్ దేశాలు ఆ ప్లాన్‌కు అంగీకరించాయని, ముస్లిం దేశాలు కూడా ఒప్పుకున్నాయన్నారు. ఇజ్రాయిల్ కూడా తమ డీల్‌కు ఓకే చెప్పిందన్నారు.
ఒకవేళ తమ ప్రణాళిక అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, గాజా సంక్షోభం ముగిసిపోతే, అప్పుడు తాను 8 సంక్షోభాలను పరిష్కరించిన వ్యక్తిని అవుతానని ట్రంప్ అన్నారు. అది ఓ అద్భుతమని, అలా ఎవరూ చేయలేదని, నోబెల్ శాంతి బహుమతి వస్తుందంటారా.. రాదు అంటూ ట్రంప్ చమత్కరించారు. ఏమీ చేయని వ్యక్తికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారని, డోనాల్డ్ ట్రంప్ మైండ్ గురించి బుక్ రాసిన వ్యక్తికి ఆ అవార్డు ఇస్తారని, నోబెల్ పీస్ ప్రైజ్ ఓ రైటర్‌కు దక్కుతుందని, ఏం జరుగుతుందో వేచి చూద్దామని ఆయన అన్నారు.
నోబెల్ శాంతి బహుమతి దక్కకుంటే, అప్పుడు అది తమ దేశానికి పెద్ద అవమానం అవుతుందన్నారు. అదెలాగో చెబుతానని, తనకు ఆ అవార్డు ఇష్టం లేదని, కానీ దేశానికి ఆ అవార్డు కావాలని, ఎందుకంటే ఎప్పుడూ ఇలాంటి సంధి జరగలేదని, దీని గురించి ఆలోచించాలని, దీన్ని తానేమీ లైట్‌గా చెప్పడం లేదని, ఎందుకంటే డీల్స్ గురించి తనకు బాగా తెలుసు అని, నా జీవితం అంతా వాటిలోనే గడిచిందన్నారు. 8 సంక్షోభాలకు ఫుల్స్టాప్ పెట్టినందుకు ఆ గౌరవం దక్కాలని ట్రంప్ అన్నారు.