ప్రభుత్వాలు భూములు అమ్మడం కొత్త కాదు. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండే అధిక విలువ కలిగిన ప్లాట్లను అమ్మడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. అయితే అందుకు ఓ రీతి, రివాజు ఉంటాయి. అందులో నిధుల సేకరణ తప్ప మరో లోపాయికారీ లక్షణమేదీ ఉండరాదన్నది అప్రకటిత నిబంధన. కానీ, హైదరాబాద్కు చెందిన 400 ఎకరాల అటవీ భూమి విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీరు ఏ రకమైన నీతి, నిబద్ధతలకూ లొంగే విధంగా లేదని క్రమంగా ఆవిష్కృతమవుతున్నది. అసలు పైకి చెప్తున్నది ఒకటి, లోపలి ఉద్దేశం వేరొకటి కావడమే అందుకు కారణం. పూటకో మాట మాట్లాడే తత్తరపాటే సర్కారు దురుద్దేశాలను పట్టిస్తున్నది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, పుట్ట పగిలితే పాములు బయటకు వచ్చినట్టు హెచ్సీయూ అటవీ భూముల వ్యవహారం వెనుక భారీస్థాయి భాగోతమే ఉందని మెల్లమెల్లగా వెల్లడవుతున్నది.
అడ్డూ అదుపూ లేని భూ దాహం పన్నిన పద్మవ్యూహంలో అటు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ, అమాయక ప్రాణులు, చెట్టూ చేమా చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. అడివే కాదని, వన్యప్రాణులే లేవని మొండివాదనతో ముందుకువచ్చిన సర్కారు తీవ్రస్థాయి ప్రతిఘటనతో, సుప్రీం కొరడా ఝళిపింపులతో వెనుకకు తగ్గినా ఇంకా పచ్చదనానికి పూర్తిగా ముప్పు తప్పలేదనే చెప్పవచ్చు. సర్కార్ పల్టీలు కొడుతున్నది సకాలంలో దొంగదెబ్బతీసి అడవిని మింగేయడానికే అని అర్థం చేసుకునేందుకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పైకి చెప్పింది రాష్ట్ర ఆర్థికస్థితిని మెరుగుపర్చడానికని. అసలు ఉద్దేశం భూములను అమ్మి భారీ గా సర్కారు ఖజానాకు సొమ్ము సమకూర్చడం కానే కాదు. వేల కోట్ల అవినీతికి వేలం రంగు పులిమి హరితావరణం గొంతు నులిమేందుకు సర్కారు సమాయత్తమైంది. ఖజానాను జనం ముందు పెట్టి వెనుక నుం చి అగ్గువకే భూమిని దొంగలు దొంగలు ఊళ్లు పంచుకోవడమే అసలు కథ. అంచెలంచెలుగా అమలుచేసే కుట్ర దీని వెనుక దాగున్నది. ధరను నానాటికి తీసికట్టు చేయడంలోనే, ఎకరా ధరను వంద కోట్ల నుంచి 23 కోట్లకు తగ్గించడంలోనే కిటుకంతా ఉన్నది. దాదాపు సగం ధరకే దక్కించుకోవాలనే ఆ తొందర.., ఆ ఉరుకులాట అని స్పష్టమైపోతున్నది.
అడివే కాదని, జీవాలే లేవని బుకాయింపులు అందుకే. రాత్రికి రాత్రే చెద పురుగుల్లా బుల్డోజర్లు అడవిని కబళించడమూ అందుకే. నోరు లేని జీవాల ఉసురు తీసిందీ అందుకే. తర్వాత మారిన పరిస్థితుల్లో ఎకో పార్కు అభివృద్ధి చేస్తామంటూ నాలుక మడత పెట్టిందీ అందుకే. పైగా మరింతగా భూమిని విశ్వవిద్యాలయం నుంచి తీసేసుకుంటారట. అసలీ ఆరాటమంతా ఎందుకోసం? ఏదో రకంగా భూమిని విడదీసి ముక్కలు చేసి గద్దల్లా వాలిన పెద్దలకు పలహారంగా సమర్పించడం, తద్వారా తిలా పాపం తలాపిడికెడు అన్నట్టుగా తామూ లబ్ధి పొందడం దీనంతటి వెనుకనున్న శక్తుల అసలు ఉద్దేశం అని చెప్పక తప్పదు. ప్రజల భూమిని పరాధీనం చేసే ఈ కుట్రకు కొన్ని మీడియా శక్తులు కొమ్ముకాయడం, న్యాయ వ్యవస్థనే నిలదీయడం విడ్డూరం. అడ్డికి పావుశేరు అమ్ముకోవడానికి అది కాంగ్రెస్ పాలకుల ప్రైవేటు జాగీరు కాదన్నది గుర్తుంచుకోవాలి.