నిడమనూరు, ఫిబ్రవరి 8 : మండలంలోని ముకుందాపురం-కంపాసాగర్ రోడ్డులోని నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాల్వలో శనివారం రాత్రి గల్లంతైన కారు ఆచూకీ లభ్యమైంది. శనివారం రాత్రి మిర్యాలగూడ నుంచి బెలొనొ కారులో త్రిపురారం మండలం కంపాసాగర్ కు చెందిన తెల్లం పుల్లయ్య(62), పద్మ(55) దంపతులు బయలుదేరారు. కారు ఎడమ కాల్వ వంతెన వద్దకు రాగానే అదుపు తప్పి కాల్వలోకి పల్టీ కొట్టిన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించిన పోలీసులు ఆదివారం తెల్లవారు జామున 3 గంటల వరకు ‘కారు’ ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు. ‘కారు’ గల్లంతైన చోటు నుంచి సుమారు పది అడుగుల దూరంలో ఆదివారం ఉదయం నీటి అడుగున ఉన్న కారును గుర్తించారు. తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. కారులో తెల్లం పద్మ విగత జీవిగా కనిపించింది.
పుల్లయ్య ఆచూకీ లభించలేదు. కారును బయటకు తీసే క్రమంలో కారు వెనుక డిక్కీ తెరిచి ఉండటంతో నీటి ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, హాలియా సీఐ సతీష్‌రెడ్డి, నిడమనూరు ఎస్ఐ ఉప్పు సురేష్ గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. పద్మ మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పుల్లయ్య మృతదేహం కోసం గాలిస్తున్నారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య తదితరులున్నారు.
ఏమరుపాటే ప్రమాదానికి కారణం!
పుల్లయ్య, పద్మ దంపతులు మరో పది నిమిషాల్లో ఇంటికి చేరనుండగా డ్రైవర్ రసూల్ ఏమరు పాటే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతులు త్రిపురారంలో తాము నడిపే కిరాణా దుకాణంలో విక్రయించేందుకు సరుకులు కొనుగోలు చేసి బయలుదేరారు. అంతకు ముందు ప్రమాదానికి గురై మిర్యాలగూడ లోని తమ కుమారుడు శివ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకున్న దంపతులు మరి కొద్ది నిమిషాల్లో ఇంటికి వెళ్తే క్రమంలో మృత్యువు కబళించడంతో వారి బంధువులు, కంపాసాగర్ గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కంపాసాగర్ రోడ్డులో కొత్తగా వచ్చే వారు కాల్వను గుర్తించే పరిస్థితి లేని కారణంగానే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ వంతెన వద్ద సూచిక బోర్డులు, లైటింగ్, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.