వంటగది చిన్నదే అయినా ఇంటికి గుండెకాయ లాంటిది. అయితే, ఇంటిల్లిపాదికీ భోజనం సమకూర్చే చోట ప్లాస్టిక్ చాప్ బోర్డులు, నాన్‌స్టిక్ పాత్రల రూపంలో మనకు కనిపించని ప్రమాదాలు దాగున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
కూరగాయలను కత్తిరించడానికి వాడే ప్లాస్టిక్ బోర్డులు తేలిగ్గా, కడుక్కోవడానికి సులువుగా, చవకగా దొరుకుతాయి. అయితే, కూరగాయలు, ఆకుకూరలు తరుగుతున్నప్పుడు బోర్డుపై కత్తి గాట్లు పడతాయి. దీంతో చిన్నచిన్న ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి. ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. మన శరీరాల్లో చేరిపోతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు అంటుకడతాయి. కాబట్టి, ప్లాస్టిక్ చాప్ బోర్డుల స్థానంలో చెక్కవిగాని, గ్లాసువి గానీ వాడితే మంచిదట. చెక్కవి మంచివే అయినప్పటికీ వీటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా లాంటి సూక్ష్మక్రిములు చేరిపోయి హానికరంగా మారతాయి. ఇక గ్లాసువి మంచివే అయినప్పటికీ కత్తి పదును తొందరగా తగ్గిస్తాయి. అలా రోజువారీ ఉపయోగానికి అంతగా పనికిరావు.
ఇప్పుడు అన్ని ఇళ్లలో కనీసం ఒక్కటైనా నాన్‌స్టిక్ పాత్ర తప్పకుండా ఉండి ఉంటుంది. వీటిని ఉపయోగించడం సులువుగా ఉన్నప్పటికీ గీతలు పడటం, పొర అరిగిపోతే మాత్రం ప్రమాదకరంగా పరిణమిస్తాయి. గీతలు పడిన నాన్‌స్టిక్ ప్యాన్లు పర్ ఫ్లోరో ఆల్కయిల్, పాలి ఫ్లోరో ఆల్కయిల్ పదార్థాలను (పీఎఫ్ఏలు) విడుదల చేస్తాయి. పీఎఫ్‌ఏలకు మనుషుల పునరుత్పాదక ఆరోగ్య సమస్యలకు సంబంధం ఉంటుంది. అందుకే నాన్స్టిక్కు బదులుగా స్టెయిన్లెస్ స్టీలు లేదా పోత ఇనుము వంటపాత్రలు వాడాలని సలహా ఇస్తున్నారు.