రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు ఇంకా కొన్ని రోజులే ఉందనగా రూపాయి దారుణంగా రికార్డు స్థాయిలో పతనమైంది. డాలరు విలువతో పోలిస్తే రూ. 87 దిగువకు జారిపోవడంతో ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటున్నాయి. చైనా, మెక్సికో, కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో డాలరు సూచీ గణనీయంగా 1.24 శాతం పైకి పోవడం ఫలితంగానే రూపాయి లోలోతుల్లోకి కుంగిపోయింది. సోమవారం రోజువారీ ట్రేడింగ్లో అత్యధికంగా నష్టపోయి 87.29గా నమోదైంది. రాబోయే రోజుల్లో మరింతగా పతనమవుతుందని కూడా హెచ్చరికలు వెలువడుతున్నాయి. రూపాయి విలువ పడిపోవడం వల్ల డాలరు కొనుగోలు మరింత కష్టతరమవుతుంది. దిగుమతుల చెల్లింపు భారమవుతుంది.
రూపాయి పతనంతో భారత ఆర్థిక వ్యవస్థపై చాలావరకు ప్రతికూల ప్రభావం పడుతుంది. దిగుమతుల విలువ, ముఖ్యంగా ముడిచమురు ధర గణనీయంగా పెరుగుతుంది. దీని ప్రభావం అన్నిరంగాల్లోనూ కనిపిస్తుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పెట్టుబడులు తరలిపోతాయి. విదేశీ రుణాలు తీసుకున్న కంపెనీలకు వడ్డీ చెల్లింపులు భారమవుతాయి. సామాన్యులు ద్రవ్యోల్బణం కింద నలిగిపోతారు. ఉప్పులు, పప్పులతో సహా అన్ని నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కుతాయి. ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడే ఎలక్ట్రానిక్స్ రంగం మీద ఒత్తిడి అధికంగా ఉంటుంది. విదేశీ చదువులు మరింత ఖరీదవుతాయి. బ్రిక్స్ చొరవలో భాగంగా డాలరు మారకం నుంచి వైదొలగాలని భారత్ భావిస్తున్నది. అలా డాలరును వదిలేస్తే భారత్ దిగుమతులపై టారిఫ్ పెంచుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న రోజుల్లోనే హెచ్చరించారు. ఆ తాఖీదు కార్యరూపం దాలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
‘రూపాయి విలువ తగ్గలేదు.. డాలరు విలువ పెరిగింది.. అంతే’ అనేది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదన. ‘డాలరుతో పోలిస్తే రూపాయి బలహీన పడటంపై నేను కూడా ఆందోళన చెందుతాను. కానీ ఇతర కరెన్సీల మారకంలో స్థిరంగా ఉంది’ అని ఆమె చెప్పుకొచ్చారు. కానీ మనదేశ వాణిజ్యంలో 86 శాతం డాలరు మారకంగానే జరుగుతుందనేది మరువరాదు. మిగిలింది కేవలం 14 శాతం మాత్రమే. రూపాయి పతనానికి ప్రముఖంగా కనపడే కారణాల్లో విదేశీ సంస్థాగత మదుపరులు వాటాలు వదిలించుకునే పనిని ఎడతెరిపి లేకుండా చేస్తుండటం అనేది ఒకటి. భారీగా పెరుగుతున్న వాణిజ్య లోటు మరో కారణంగా చెప్పవచ్చు. రెండూ కలిసి రూపాయిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. రూపాయి పతనం వల్ల కొన్ని ప్రయోజనాలూ ఒనగూరుతాయి. భారతీయ ఎగుమతుల్లో పోటీతత్వం పెరుగుతుంది. భారత్కు డాలర్లు పంపించే ప్రవాసుల సంపద కూడా పెరుగుతుంది. ఇండియాలో ఎగుమతి సంపాదన విలువా పెరుగుతుంది. ఐటీ, ఫార్మా వంటి ఎగుమతి ఆధారిత పరిశ్రమలు దీనివల్ల లాభపడటమూ జరుగుతుందనేది వాస్తవం. అయితే అసలు సమస్యతో పోలిస్తే ఇవి లెక్కలోకి వచ్చేవి కావు. రిజర్వ్ బ్యాంక్ త్వరలో చేపట్టనున్న దిద్దుబాటు చర్యల మీదే రూపాయి భవిత ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు.