న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర సంస్థలు ఐటీ, ఈడీ తమ దాడులను ఉధృతం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ర్టాల్లో విపక్ష నేతలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సోదాల పేరిట తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు కే సెల్వపెరుంతగైని సోమవారం గృహ నిర్బంధంలో ఉంచిన ఐటీ అధికారులు ఆయనను రాహుల్‌గాంధీ వెంట ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దేబశీష్ కుమార్ ఇంటితోపాటు ఆ పార్టీకి నిధులు సమకూరుస్తున్నారన్న అనుమానంపై వివిధ సంస్థలు, కంపెనీలపై ఈడీ, ఐటీ దాడులకు దిగాయి. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ, ఓ నిర్మాణ కంపెనీపై ఈడీ దాడులు చేయగా, తృణమూల్ అభ్యర్థి ఇంటిని ఐటీ అధికారులు సోదా చేశారు. ఈ రెండు రాష్ర్టాల్లో డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల విజయం కోసం పనిచేస్తున్న ‘ఐప్యాక్’ సంస్థను కూడా ఈడీ లక్ష్యంగా చేసుకున్నది.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల మీదికి కేంద్ర సంస్థలను ఉసిగొల్పుతున్నదన్న ఆరోపణలు గత కొన్నేండ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో ఐటీ, ఈడీ సంస్థలు విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని హల్చల్ చేస్తున్నాయి. తమిళనాడులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారానికి రానున్న సమయంలోనే రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిని ఐటీ గృహ నిర్బంధంలో ఉంచింది. ఓటర్లకు పంచడం కోసం సెల్వపెరుంతగై తన ఇంట్లో భారీ ఎత్తున నగదు దాచి ఉంచినట్టు తమకు ఫిర్యాదు వచ్చిందని, అందువల్ల తాము సోదాలు చేసే సమయంలో ఇంట్లోనే ఉండాలని ఐటీ అధికారులు ఆయనను ఒత్తిడి చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమిళనాడులో మంగళవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా ఈ కీలక సమయంలో పీసీసీ అధ్యక్షుడిని నిర్బంధించడంపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది.
ఇక ఐప్యాక్ సంస్థ మీద ఢిల్లీ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖాతాలు తారుమారు చేశారని, లెక్కల్లో చూపని నిధులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఈ కేసు నమోదైంది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ ఐప్యాక్ డైరెక్టర్ రిషిరాజ్సింగ్కు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 20 రోజులపాటు తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ఐప్యాక్ సంస్థ ప్రకటించింది. ఇది పశ్చిమ బెంగాల్‌లోని వివిధ నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న ఐప్యాక్ సిబ్బందిపై ప్రభావం చూపనుంది. ఇక ఇదే రాష్ట్రంలో తృణమూల్‌కు అనుకూలంగా ఉన్నాయన్న అనుమానంతో ఐటీ, ఈడీ సంస్థలు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ, ఓ నిర్మాణ కంపెనీకి చెందిన కార్యాలయాలపై దాడులు చేశాయి. తృణమూల్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే దేబశీష్కుమార్ ఇల్లు, ఎన్నికల కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించాయి. రాజకీయ దురుద్దేశంతోనే ఈ దాడులు జరుగుతున్నట్టు తృణమూల్ నేతలు ఆరోపించారు.
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ హారిస్ కుమారులకు చెందిన బెంగళూరు ఆఫీసుల్లో సోమవారం ఈడీ దాడులు నిర్వహించింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించి మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్టు వారిపై ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్యే కుమారులతోపాటు క్రిప్టో హ్యాకర్ శ్రీకృష్ణ రమేశ్ అలియాస్ శ్రీకి చెందిన కార్యాలయాలను ఈడీ లక్ష్యంగా చేసుకుంది. శ్రీతోపాటు అతడి సహాయకులు జాతీయ, అంతర్జాతీయ వెబ్సైట్లను హ్యాక్ చేసి, బిట్కాయిన్లను దొంగిలించారంటూ 2017లో పలు కేసులు, చార్జ్షీట్లు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగా తాజా సోదాలు జరిగాయి. క్రిప్టో నేరాల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి ఎమ్మెల్యే కుమారులు లబ్ధి పొందినట్టు ఆరోపణలున్నాయి. హారిస్ బెంగళూరులోని శాంతినగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.