నార్నూర్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ( MP Godam Nagesh ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ( School Building ) ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జిల్లా కలెక్టర్ రాజర్షిషా కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కుంమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఎంపీ మాట్లాడుతూ ఉమ్మడి మండలంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ నార్నూర్, గాదిగూడ మండలంలోని పలు సమస్యలను వివరించారు. కేంద్ర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పిల్లలను తప్పకుండా పాఠశాలలకు పంపించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. లోకారి సమీపంలోని లో లెవెల్ కల్వర్టు వద్ద భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండలి పుష్పలత, డీఈవో మాధవి, ఎంఈవో జాదవ్ రమేష్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో శ్రీనివాస్, గాదిగూడ వైస్ మాజీ ఎంపీపీ మర్శివనే యోగేష్ తదితరులు పాల్గొన్నారు.