కైరో : ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజ యంగా కొనసాగుతున్నది. గురువారం మహిళల 50మీటర్ల రైఫిల్-3 పొజిషన్ విభాగంలో యువ షూటర్ ప్రాచి గైక్వాడ్ పసిడి పతకంతో మెరిసింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ప్రాచి 354.6 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకోగా, దర్యా చుప్రెస్ (354.4), ఎలెనా క్రెటీనినా (343.3) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన అర్హత రౌండ్లో 578 పాయింట్లతో భారత్ తరఫున ఏకైక షూటర్ ఫైనల్లోకి ప్రవేశించిన ప్రాచి..ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చింది. మూడు రౌండ్లలో అంతకంతకు ఆధిక్యా న్ని పెంచు కుంటూ అగ్రస్థానం దక్కించు కుంది.
మరోవైపు మహిళల జూనియర్ 10మీటర్ల ఎయిర్ పిస్టల్ తుది పోరులో భారత్కు చెందిన వంశిక చౌదరి (241.3) స్వర్ణ గురితో అదరగొట్టగా, సెజా ల్ కాంబ్లీ (239.6) రజత పతకాన్ని ముద్దాడింది. పురుషుల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో నరేన్ ప్రణవ్ 229.5 పా యింట్లతో కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ఇదే విభాగంలో జావోహిర్ (251.2), అచిల్లీయస్ (250.2) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకు న్నారు. మొత్తంగా టోర్నీలో భారత షూటర్లు మూడు స్వర్ణాలు సహా ఐదు రజతాలు, మూడు కాంస్యాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది.