దుబాయ్, జూన్ 13: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, తాజాగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇరాన్ అణుస్థావరాలు లక్ష్యంగా శుక్రవారం ఉదయం ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు ఉన్నత సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు మరణించగా, ఇరాన్ అణు, క్షిపణి స్థావరాలు ధ్వంసమైనట్టు తెలిసింది. ఇరాక్‌తో 1980లో జరిగిన భీకర యుద్ధం తరువాత తిరిగి ఆ స్థాయిలో దాడులను ఎదుర్కోవడం ఇరాన్‌కు ఇదే మొదటిసారి. ఈ దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల ప్రధాన అధికారి జనరల్ మొహమ్మద్ బాఘేరి, రెవెల్యూషనరీ గార్డ్స్ జనరల్ హొస్సేన్ సలామీ, ఖండాంతర క్షిపణి కార్యక్రమం అధికారి జనరల్ అమీర్ అలీ హాజీజాదే, పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మృతి చెందారు. ఇరాన్ సైతం వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పైకి వందకుపైగా డ్రోన్లను ప్రయోగించింది.
ఇజ్రాయెల్‌కు ‘తీవ్రమైన శిక్ష’ తప్పదు అని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను పలు దేశాలు ఖండించాయి. వెంటనే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఉభయ దేశాలు ప్రయత్నించాలని ప్రపంచ నాయకులు పిలుపునిచ్చారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అట్టుడుకుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌లు ఎప్పటినుంచి దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియా ప్రమాదకరంగా మారవచ్చని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్ అణు కార్యక్రమాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
టార్గెట్లు ఛిన్నాభిన్నం
దాదాపు 200 యుద్ధ విమానాలు ఇరాన్‌లోని 100కుపైగా లక్ష్యాలపై దాడులు చేశాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇక ఇరాన్‌లోనే తమ స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్న ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అక్కడి నుంచే టెహ్రాన్‌కు సమీపంలోని మిస్సైల్ లాంచర్లపై దాడులు చేసినట్టు తెలిపింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను, వాహనాలపైనుంచి దాడులు చేసే వ్యవస్థను సెంట్రల్ ఇరాన్‌కు ఇంతకుముందే రహస్యంగా తరలించామని తెలిపింది. ఇక్కడి నుంచే ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థపై దాడి చేశామని పేర్కొంది.
నతాంజ్ అణుకేంద్రం ధ్వంసం
ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ ప్రాంతంలోని ఇరాన్ ప్రధాన అణుశుద్ధి కేంద్రం దెబ్బతిన్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున నల్లటి పొగ రావటం చూశామని స్థానికులు చెప్పారు. ఈ కేంద్రంలో ఆరుగురు అణు శాస్త్రవేత్తలు మృతిచెందినట్టు సమాచారం. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలను డజన్ల కొద్దీ రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడుల్లో ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కీలక నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టు సమాచారం. రెవెల్యూషనరీ గార్డ్స్ కీలక నాయకత్వం ఓ భూగర్భ బంకర్లో సమావేశం నిర్వహిస్తుండగా, తాము దాడి చేశామని దీంతో అందరూ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. ఇరాన్ వెంటనే ప్రతీకార దాడులకు దిగుతూ ఇజ్రాయెల్‌పైకి 100కు పైగా డ్రోన్లను పంపింది. అవన్నీ ఇరాక్, జోర్డాన్ గగనతలం నుంచి వెళ్లినట్టు ఆయా దేశాల అధికారులు వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లను తమ గగనతలం వెలుపలనే అడ్డుకున్నామని ఇజ్రాయెల్ తెలిపింది.
ఇప్పటికైనా దిగిరండి : ట్రంప్
అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ ఇప్పటికైనా తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ‘ఇజ్రాయెల్ దాడులు మరింత ఉధృతమవుతాయి’ అని హెచ్చరించారు. ‘ఈ మారణహోమాన్ని ఆపడానికి ఇంకా సమయం ఉంది, తదుపరి జరుగబోయే దాడులు మరింత క్రూరంగా ఉంటాయి. అంతా నేలమట్టం కాకముందే ఇరాన్ ఒప్పందం చేసుకోవాలి. ఒకప్పుడు ఇరాన్ సామ్రాజ్యంగా పేరొందిన ప్రదేశాన్ని కాపాడుకోవాలి. మరణాలు వద్దు, విధ్వంసం వద్దు. ఇంకా ఆలస్యం కాకముందే వచ్చి ఒప్పందం చేసుకోండి’ అని రాసుకొచ్చారు. ఇజ్రాయెల్ జరిపిన దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా పేర్కొంది. ఇరాన్ జరిపే ప్రతీకార దాడుల్లో అమెరికా పౌరులు, ప్రయోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇరాన్ ముప్పును తొలగిస్తాం: నెతన్యాహూ
ఇరాన్ అణు ముప్పును నిర్మూలించడం తమకు తప్పనిసరి అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకే ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ను ప్రారంభించామని తెలిపారు. ఇందుకు తమకు ఒక ఏడాది లేదా కొన్ని నెలలు పట్టవచ్చు అని చెప్పారు. ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ అణు కార్యక్రమం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అందుకే ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. తన యుద్ధం ఇరాన్ ప్రజలతో కాదని అన్నారు. ‘గత 46 ఏండ్లుగా మిమ్ములను తొక్కి ఉంచుతున్న క్రూర నియంతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మీ విమోచన దినం దగ్గరలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఇజ్రాయెల్ ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థపై దాడులు చేస్తున్నది. గత ఏడాది ఏప్రిల్‌లో రష్యన్ తయారీ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. అక్టోబర్‌లో క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేసింది.
ఇక చర్చల్లేవు: ఇరాన్
అమెరికాతో జరుగుతున్న అణు చర్చల నుంచి వైదొలగుతున్నామని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసిందని, దానికి కఠిన శిక్ష విధిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ తన క్రూరమైన, రక్తసిక్తమైన హస్తాన్ని ఇరాన్లో నేరాలకు పాల్పడేందుకు చాచిందని విమర్శించారు.