హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఇండ్ల నిర్మాణానికి 3 లక్షలు ఇస్తున్నారా? అని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యులపై మండిపడ్డారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సొంత జాగ ఉన్నవారికి రూ.3 లక్షలు ఇస్తామంటున్నారు.. గతంలో 5 లక్షలు ఇస్తామని చెప్పి తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేయొద్దు.. సొంత జాగ ఉంటే ఐదు లక్షలు ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదు.. ఉంటే చూపించండి’ అని నిలదీశారు. పోనీ కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ఈ మాత్రంగానైనా రూ.3 లక్షలు ఇస్తున్నారా? అని నిలదీశారు.