హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. డీహెచ్ పరిధిలో చేపట్టిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏవో) ప్రమోషన్లలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 పరిధిలో 92 మందికి ఏవోలుగా ప్రమోషన్లలో కల్పించారు. ఈ ప్రక్రియలో అనర్హులకు ప్రమోషన్లు కల్పించి పెద్ద మొత్తం డబ్బులు కొల్లగొట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. హడావిడిగా డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేయించి, తాము కోరుకున్నవారితో ప్రమోషన్ల జాబితా సిద్ధం చేశారని, ఉద్యోగోన్నతులు కల్పించిన 92 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.1.84 కోట్లు కొల్లగొట్టారని తెలిసింది. ఈ వ్యవహారమంతా డీహెచ్, అడిషనల్ డైరెక్టర్ కనుసన్నల్లో జరిగి
నట్టు సమాచారం. వసూళ్ల పర్వాన్ని డీహెచ్ పీఏ ముందుండి నడిపారని, వసూలు చేసిన మొత్తాన్ని వాటాలు వేసి పంచుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇతర ఉద్యోగులు మండిపడుతున్నారు. వైద్యారోగ్య శాఖలో ఏవోలుగా ఉద్యోగోన్నతులు వస్తాయని ఎన్నో ఏండ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తుంటే ముడుపులు చెల్లించిన వారికే ప్రమోషన్లు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ అవినీతి బాగోతంపై కొందరు ఉద్యోగులు లేఖ ద్వారా వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వరంగల్, హైదరాబాద్ పరిధిలో కొంతమంది పేర్ల ను డీపీసీ అప్రూవల్ కమిటీలో చేర్చేందుకు రూ.50 లక్షలు వసూలు చేశారని, ఒక్కో జోన్ పరిధిలో రూ.25 లక్షల వసూళ్లకు పాల్పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ వసూళ్ల వ్యవహారాన్ని డీహెచ్ పీఏ ముందుం డి నడిపారని, ఆ వసూళ్ల ద్వారా వచ్చిన సొ మ్మును డీహెచ్, అడిషనల్ డైరెక్టర్ వాటాలు వేసుకుని పంచుకున్నారని, గతంలో నర్సింగ్ ఉద్యోగోన్నతుల్లోనూ ఇదేవిధంగా అవినీతి జరిగిందని ఉద్యోగులు ఆరోపించారు. ఈ ప్రమోషన్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని, అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏవో ప్రమోషన్లను పారదర్శకంగా చేప ట్టాం. అభ్యర్థుల సందేహాలను ఐఏఎస్ ఆఫీసర్లు, హెచ్వోడీలతో కూడిన కమిటీలో నివృత్తి చేశాకే ఈ ప్రక్రియను పూర్తి చేశాం. మొత్తం ప్రక్రియను ప్రభుత్వం కూడా పరిశీలించింది. అయినప్పటికీ ఉద్యోగోన్నతుల కోసం కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఏవో ప్రమోషన్లలో అక్రమాలకు అవకాశమే లేదు. సీనియారిటీ లిస్టు తయారయ్యాక ఆ జాబితాను డిస్ప్లే చేశాం.
– డీహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్