హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి చేపట్టిన నియామక ప్రక్రియలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులకు వెయిటేజీ మార్కులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు ప్రభుత్వం నిరుడు సెప్టెంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 మార్కులకు నిర్వహించే పరీక్షలో 80 పాయింట్లను మార్కుల ఆధారంగా, 20 పాయింట్లను ప్రభుత్వ దవాఖానల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు కేటాయిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఆన్లైన్లో అప్లికేషన్లను 21వ తేదీ వరకు నుంచి స్వీకరించి, నవంబర్ 10న పరీక్షలు నిర్వహించింది. ఇందులో డీహెచ్ పరిధిలో 1088, టీవీవీపీ పరిధిలో 183, హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో 13 పోస్టులు కలిపి, మొత్తం 1284 పోస్టులకు 22 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందించిన వారికే వెయిటేజీ మార్కులు కలుపుతామని ప్రభుత్వం నోటిఫికేషన్లోనే పేర్కొన్నది. కానీ డయాగ్నోస్టిక్ హబ్ మేనేజర్, రీసెర్చ్ సైంటిస్ట్, ఒకేషనల్ కాలేజీ జూనియర్ లెక్చరర్, సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్, 108 ఎమర్జెన్సీ టెక్నీషియన్లకు కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు వెయిటేజీ మార్కులు కేటాయించారు. అర్హతలు లేకున్నా 170 మందికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం వెనుక లక్షల్లో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు తప్పుడు అనుభవ పత్రాలు సమర్పించినా, అధికారులు పట్టించుకోలేదని పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. కొంత మందికి జోన్-2లో ప్రొవిజనల్ మెరిట్‌లిస్ట్‌లో పేరు రాగా, వారికే జోన్-1 ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లోనూ చోటుదక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పలు అభ్యంతరాలు, అనుమానాలతో రిక్రూట్మెంట్ బోర్డుకు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 నోటిఫికేషన్ రాగానే కొంతమంది ల్యాబ్ అసిస్టెంట్లు, ల్యాబ్ అటెండెంట్లు తమకు వెయిటేజీ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. 2022లో జారీ చేసిన జీవో నంబర్ 59 ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లో పనిచేసే వారికే అవకాశం కల్పిస్తామని ఆ సందర్భంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ చెప్పిందని పలువురు అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. అదే బోర్డ్ ఇప్పుడు డయాగ్నోస్టిక్ హబ్ మేనేజర్లు, రీసెర్చ్ సైంటిస్టులు, ఒకేషనల్ కాలేజీ జూనియర్ లెక్చరర్లు, టీబీ లాబొరేటరీ సీనియర్ సూపర్వైజర్, ల్యాబ్ అటెండెంట్లు, 108 ఎమర్జెన్సీ టెక్నీషియన్లను కూడా వెయిటేజీ మార్కులకు అర్హులుగా ప్రకటించడంపై 58 మంది అభ్యర్థులు న్యాయపోరాటనికి సిద్ధమయ్యారు.
నియామక ప్రక్రియ పారదర్శకంగానే చేపట్టాం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగానికి 12 రకాల అర్హతలు ఉన్నాయి. నోటిఫికేషన్లో 12 రకాల క్యాటగిరీల గురించి ప్రస్తావన లేకపోయినా గతంలోనూ ఇదే పద్ధతిలో నియామకాలు చేపట్టాం. జూనియర్ అనలిస్ట్లతోపాటు అర్హులైన ఇతరులకు ల్యాబ్ టెక్నీషియన్ క్యాడర్ ఇవ్వొద్దని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అప్లికేషన్లను డీఎంహెచ్వోలు, సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాతనే నియాకమ ప్రక్రియ చేపడుతున్నాం