హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలోని రామస్వామిగుట్ట సమీపంలో ఉన్న ఇనుప యుగపు ఆనవాళ్లు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రామస్వామి గుట్టపైకి వెళ్లే మార్గానికి ఇరువైపులా దాదాపు 100 సమాధులు ఉం డేవని, వాటిలో ప్రస్తుతం 10 మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఆదివారం ఆయన దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ఎం వేదకుమార్తో కలిసి రఘునాథపురంలోని బృహత్ శిలాయుగపు స్థావరాన్ని సందర్శించారు. అక్కడ ఉండాల్సిన రాతియుగపు నూరుడు గుంతలు, ఇనుప యుగపు సమాధులు కనుమరుగైనట్టు గుర్తించారు. క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నాటివైన ఈ నిర్మాణాలు ఆనాటి మానవుల అంత్యక్రియల సంప్రదాయాన్ని తెలియజేస్తున్నాయని డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు. వీటిని కాపాడి భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని స్థానికులకు సూచించారు. ఈ ప్రాంతాన్ని పురావస్తు, వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం పూనుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.