Mojtaba Khamenei : అమెరికా- ఇజ్రాయెల్ (US-Israel) దేశాలు తమపై అకారణంగా దాడులు చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) మండిపడ్డారు. ఈ దాడులవల్ల దేశంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాల (Infrastructure) ను పునరుద్ధరించడానికి అందరం నడుం బిగిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే (Islamic Republic Day) సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఖమేనీ సందేశం విడుదల చేశారు.
అమెరికా- ఇజ్రాయెల్ తమ దేశంపై కొనసాగిస్తున్న నీచమైన, దురాక్రమణ దాడులను మొజ్తాబా ఖండించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్లో మౌలిక సదుపాయాలతోపాటు పర్యావరణం కూడా దెబ్బతిన్నదని అన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ అంతర్గత అభివృద్ధిపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధిని విస్తరించడం, ఇరాన్ ఉజ్వల భవిష్యత్తుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌లోని మినాబ్ పాఠశాలపై జరిగిన దాడి గురించి మొజ్తాబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటనలో 186 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరికి నివాళిగా పట్టణ, గ్రామీణప్రాంతాల్లో నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
యుద్ధంలో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ఇరాన్ ప్రజలు మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. తమకు అమెరికన్లపై ఎలాంటి శత్రుత్వం లేదని అన్నారు. అనేకసార్లు ఒత్తిళ్లు, ఆంక్షలు ఎదురైనప్పటికీ తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదని మొజ్తాబా చెప్పారు. తమపై చేస్తున్న దాడులను దృఢంగా ధైర్యంగా తిప్పికొడుతున్నామని అన్నారు.