Donald Trump : ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్దంపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చీటికిమాటికి బాధ్యతారహిత ప్రకటనలు చేస్తున్నారు. ఓసారి యుద్ధం కొనసాగుతుందని అంటాడు. మరోసారి యుద్ధాన్ని ముగిస్తామని చెబుతాడు. కొన్ని గంటల క్రితమే రెండుమూడు రోజుల్లో ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని చెప్పిన ట్రంప్.. ఇప్పుడు మళ్లీ మాటమార్చారు. రెండుమూడు వారాల్లో ఇరాన్‌పై భీకర బాంబు దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ కీలక నాయకత్వం అంతమైందని, ఆ దేశ నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు.
ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలని, లేకపోతే ఆ దేశాన్ని రాతియుగానికి తీసుకెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదని, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోందని అన్నారు. ఇరాన్‌పై నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తిచేసే దిశగా తాము ముందుకుసాగుతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధంలో ఇరాన్ భారీగా నష్టపోయిందన్నారు. వారి సైనిక సామర్థ్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు వీలులేదని పునరుద్ఘాటించారు.
ఇప్పటివరకు తాము ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకొని దాడి చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. కానీ అవసరమైతే తాము వాటిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. అమెరికా భద్రత కోసమే ఈ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని ప్రారంభించామని వ్యాఖ్యానించారు. యూఎస్‌ను అంతం చేయాలని ఇరాన్ కోరుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తామన్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా తన లక్ష్యాలను చేరుకుందని, ఇది అతి త్వరలోనే ముగుస్తుందని అన్నారు.
యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంపై కూడా ఆయన మాట్లాడారు. ఇది తాత్కాలికమేనని అన్నారు. ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ జలసంధి నుంచి వచ్చే చమురుపై యూఎస్ ఆధారపడటం లేదని, భవిష్యత్తులో కూడా దాని అవసరం ఉండదని అన్నారు. దీనిపై ఆధారపడిన దేశాలే ధైర్యాన్ని కూడగట్టుకొని జలసంధిని చూసుకోవాలన్నారు. అయితే ఇరాన్ ప్రతీకార దాడులకు గురవుతున్న గల్ఫ్ దేశాలకు తాము అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు.