India’s Oil Tanker : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల పరస్పర దాడులతో హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒమన్ కారిడార్ (Omani Caridor) నుంచి వెళ్తున్న ఓ భారత చమురు ట్యాంకర్ (India’s Oil Tanker) ను ఇరాన్ భద్రతా దళాలు వెనక్కి పంపించినట్లు తెలిసింది. అమెరికా పర్యవేక్షణలోని ఒమన్ కారిడార్ కాకుండా హర్మూజ్ జలసంధిలో తాము నిర్దేశించిన మార్గాన్నే వినియోగించుకోవాలని ఐఆర్జీసీ సూచించినట్లు సమాచారం.
గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయిన నౌకలు వాటి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయం చూపించిన ఒమన్, ఐరాస సముద్రయాన సంస్థ (UNIMO) లు.. ఒమన్ తీరం నుంచి వెళ్లాలని సూచించాయి. దాంతో అమెరికా పర్యవేక్షణలో ఉన్న ఈ తాత్కాలిక కారిడార్‌నే ఆయా నౌకలు ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఐఆర్జీసీ మాత్రం తాము సూచించినట్లు హర్మూజ్ మార్గంలోనే వెళ్లాలని నౌకలను హెచ్చరిస్తున్నట్లు తెలిసింది.
జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ పర్షియన్ గల్ఫ్‌లో తొమ్మిది భారత ట్యాంకర్లు చిక్కుకున్నాయని, వాటిలో 198 మంది నావికులు ఉన్నట్లు తెలిసింది. వీటిలో పూర్తిస్థాయిలో ఇంధనం, గ్యాస్‌తో కూడిన నౌకలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న భారత ప్రభుత్వం.. ఆ నౌకలను సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు ఇరాన్‌తో సంప్రదింపులు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.