టెహ్రాన్, జూలై 18: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రభావం గల్ఫ్‌పై కూడా తీవ్రంగా పడుతున్నది. ఇరాన్ మిలిటరీ సౌకర్యాలు లక్ష్యంగా అమెరికా ఏడవ రోజు దాడులు కొనసాగించింది. దీనికి ప్రతీకారంగా యూఎస్ స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ శనివారం కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై క్షిపణి, డ్రోన్ల దాడులు నిర్వహించింది. కువైట్‌లోని ఒక ప్రధాన చమురు కేంద్రంపై దాడులు చేసింది. తమకు చెందిన ఒక ముఖ్యమైన ఆయిల్ కేంద్రంపై ఇరాన్ దాడి చేసినట్టు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. ఈ దాడిలో పలువురు గాయపడగా, గణనీయమైన నష్టం ఏర్పడింది. ఈ దాడులు నీటిశుద్ధి ప్లాంట్లు, విమానాశ్రయ కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. తమపై దాడులు ఇలా మరో మూడు నాలుగు రోజులు కొనసాగితే తాము పూర్తి స్థాయి ఘర్షణకు దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. తమ విద్యుత్తు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
మందుపాతరలు పేలి రెండు చమురు నౌకలు ధ్వంసం!
ఆంక్షలను ఉల్లంఘించి హొర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించిన రెండు చమురు నౌకలు సముద్రంలో అమర్చిన మందుపాతరలకు తగిలి నిప్పంటుకుని పేలిపోయాయి. ఇరాన్ పాక్షిక అధికారిక వార్తా సంస్థ తస్నీమ్ న్యూస్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా సహకారంతో హొర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించిన నాలుగు నౌకలను అడ్డుకున్నామని, రెండు చమురు నౌకలు పేలిపోయాయంటూ ఇరాన్ చేసిన ప్రకటనను యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఖండించింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది.