టెహ్రాన్, వాషింగ్టన్, మే 2: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇరాన్ సాయుధ దళాలు వెల్లడించాయి. ఎటువంటి ఒప్పందాలకు అమెరికా కట్టుబడి లేదని ఆధారాలు చూపిస్తున్నాయని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన ఒక ప్రకటనలో ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం డిప్యూటీ మహమ్మద్ జాఫర్ అసదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధికారులు ఇటీవలి చర్యలు, ప్రకటనలు దౌత్యపరమైన అవగాహనల పట్ల నిబద్ధతా లోపాన్ని సూచిస్తున్నాయని ఆరోపించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని, వాటి ముఖ్య ఉద్దేశం మొదట చమురు ధరల పతనాన్ని నివారించడం, ఆ తర్వాత తాము సృష్టించుకున్న గందరగోళం నుండి బయటపడడం అని అసదీ అన్నారు. అమెరికన్ల నుంచి ఎలాంటి కొత్త దుస్సాహసాలు లేదా అవివేక చర్యలనైనా ఎదుర్కొనడానికి సాయుధ దళాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.
ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. యుద్ధంపై కాంగ్రెస్ చట్ట సభ సభ్యులకు రాసిన లేఖలో కాల్పుల విరమణ తర్వాత ఇరాన్‌తో ఎలాంటి సాయుధ ఘర్షణ జరగలేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన శత్రుత్వం ముగిసిందని తెలిపారు. యుద్ధం కొనసాగించడానికి చట్టసభ సభ్యుల అనుమతి అవసరం లేదన వాదనను బలపరుచుకొనే ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది.