హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): యూనిట్ ఆఫీసర్ల సమావేశంలో సాధారణంగా వారే ముందు వరుసలో కూర్చుంటారని, లా అండ్ ఆర్డర్ డీజీపీ ఆ కోవకు చెందిన వారు కాదని సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ ఎం భగవత్ స్పష్టం చేశారు. ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ‘సీఎం సమక్షంలో దళిత ఐపీఎస్‌కు అవమానం’ అనే వార్తకు ఆయన స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన గణేశ్ ఉత్సవాల సమీక్షా సమావేశంలో వెనుక వరుసలో కూర్చోవడానికి, తన కులానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనను దళిత అధికారిగా పేరొంటూ, అదే కారణంతో వెనుక వరుసలో కూర్చోబెట్టినట్టు వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాను దళితుడిని కాదని స్పష్టంచేశారు.
అధికారుల సామాజిక స్థితిగతులు తెలియకుండా వారిని కులపరమైన వివాదాల్లోకి లాగడం సరికాదని పేర్కొన్నారు. యూనిట్ ఆఫీసర్ల మీటింగ్‌లో ఆ అధికారులకే ప్రాధాన్యం ఉంటుందని, ఒకవేళ మొదటి వరుసలో స్థలం ఖాళీగా ఉంటే, ఇతర సీనియర్ అధికారులు కూడా అకడ కూర్చోవచ్చనే విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో వెనుక వరుసలో కూర్చున్నానని వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత లా అండ్ ఆర్డర్ డీజీ హోదాలో మలాజిగిరి కమిషనరేట్‌లో పెద్ద గణేశ్ విగ్రహం ఏర్పాటు చేసే అంశంపై సీఎంతో స్వయంగా మాట్లాడినట్టు చెప్పారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సివిల్ సర్వెంట్లు ప్రవర్తనా నియమావళికి కట్టుబడి, వృత్తిపరంగా తమ విధులను నిర్వర్తిస్తున్నందున, తమను అనవసరమైన వివాదాల్లోకి లాగొద్దని కోరారు.