రక్తహీనత అంటే ఏమిటో తెలియదు.. పోషకాల లోపాల గురించి అవగాహన లేదు. కానీ, ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే.. పనిచేయడం. ఆ పని పదిమందికీ ఉపయోగపడటం. అధికారుల ఆలోచనను ఆచరణలో పెట్టింది ఆ మహిళ. తాను మాత్రమే కాకుండా 14 మంది మహిళలతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి పునాదులు వేసింది. వనదేవత ఒడిలో రాలే ఇప్పపువ్వులను తీసుకొచ్చి వాటితో లడ్డూలను తయారు చేసింది. రక్తహీనతతో బాధపడే గర్భిణులకు, బాలికలకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది కొమురం భాగుబాయి. తాను ఆదాయం పొందడంతోపాటు ఆడబిడ్డల ఆరోగ్యాన్నీ కాపాడుతున్న భాగుబాయిని ‘జిందగీ’ పలకరించింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
అడవులకు నిలయమైన ఆదిలాబాద్‌లో పుట్టిపెరగడం వల్ల పోషకాల తిండి తిని బతికిన. మా నాన్న మాకోసం పుట్టతేనె, పండ్లు, ఎర్రకాళ్ల గడ్డలను తెచ్చి మాకు పెట్టేటోడు. మాదొక గిరిజన గ్రామం కావడంతో అప్పట్లో పట్నం పోయి సదువుకోవాలంటే రవాణా సౌకర్యం ఉండేది కాదు. అమ్మాయిలకు ప్రభుత్వ హాస్టళ్లు కూడా లేకపోవడంతో చదువుకు దూరమైన. కానీ, మా నాయిన మాత్రం చదువుకున్నడు. అప్పట్లనే టీచర్ కొలువు వస్తే కూడా వద్దనుకుని వ్యవసాయం చేసిండు. నాకు చిన్నతనంలనే పెళ్లి చేసిండు. పెండ్లి తర్వాత ఉట్నూర్‌కు పోయిన. అప్పట్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ పథకాలు వస్తయని అధికారులు చెప్పడంతో 2003లో ‘భాగుబాయి మహిళా సంఘాన్ని’ ఏర్పాటు చేసిన. అయితే మాది రిజిస్టర్ సంఘం కాకపోవడం, మా సంఘానికి వీవో లేకపోవడంతో పావలా వడ్డీ పైసలు వేరే సంఘానికి పడ్డాయి. అధికారులను అడిగితే అస్సలు ముచ్చటచెప్పిన్రు. వెంటనే 2007లో రిజిస్టర్ సంఘంగా గుర్తింపు రావడంతో పాటు నన్ను 36 సంఘాలకు వీవోను చేసిన్రు.
చదువురాకున్నా తెలివి ఉండబట్టి వీవోగా నిలదొక్కుకున్నా. ఏండ్లు గడిచిపోయినయి. నా గురించి తెలుసుకొని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన విఠల్‌రావు సార్ కోళ్ల పెంపకం గురించి చెప్పిండు. వాటిని పెంచుమని చిన్నచిన్న కోడిపిల్లలను ఇచ్చిపోయిండు. ఒక్క పిల్ల కూడా సచ్చిపోకుండా పెంచిన. నా కమిట్మెంట్ను చూసి ఒకసారి నాతో మాట్లాడాలని మా ఇంటికొచ్చిండు. వాళ్లేమో చదువుకున్నోళ్లు. మేము అక్షరం ముక్క రానోళ్లం. మాతో ఏం పనుంటదని అనుమానంగనే అడిగిన. అప్పుడే చెప్పిండు గీ ఇప్పపువ్వు లడ్డూల గురించి. ‘ఆదిలాబాద్ జిల్లాల గర్భిణులు, బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించాం. ఇప్పపువ్వు లడ్డూలు రక్తహీనత రాకుండా కాపాడుతాయ’ని చెప్పిండు. ఇప్పపువ్వు కూరొండుకోవడం తెలిసిన మాకు లడ్డూలు తయారు చేయడం కొత్తగా అనిపించింది. కానీ, అది ఎలా తయారు చేయాలో తెల్వలేదు. ‘మూడు రోజుల్లో ఓ 20 మందిని మోపు చేయి వాళ్లకు ఎట్ల తయారు చేయాలో చూపిద్దాం’ అని చెప్పిపోయిండు సార్. అట్లనే ఓ 20మంది దాక ఆడోళ్లందరం కలిసినం. మా అందరిని మహారాష్ట్ర పంపి ట్రైనింగ్ ఇప్పించిండు.

ట్రైనింగ్ అయితే తీసుకున్నాం కానీ, లడ్డూలు తయారు చేయనీకి జాగ లేదని గవర్నమెంటోళ్లు ఆలస్యం చేసిన్రు. ఒక నెల తరువాత ఒక గదిలో మా పనిని మొదలు పెట్టినం. అలా 2019లో ఆదివాసీ ఆహారంగా చెప్పుకొనే ఇప్పపువ్వు లడ్డూల తయారీని ప్రారంభించినం. వాటిని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరు నెలల పాటు 3300 మంది గర్భిణులకు అందించినం. అద్భుతమైన మార్పొచ్చింది. వాళ్లంతా రక్తహీనతను జయించారని ఆఫీసర్లు చెప్పిన్రు. ఇప్పటికీ లడ్డూలనైతే తయారు చేసినం కానీ, మార్కెటింగ్ చేసుకోవడంలో వెనుకబడ్డం. కొనేవాళ్లు లేకపోతే చేసినవి పాడైపోతయని భయపడినం. ఎక్కడ మీటింగులు జరిగినా లడ్డూలు తీసుకొని వెళ్లి అక్కడో స్టాల్ ఏర్పాటుచేసేది. ‘ఇప్పపువ్వుతో సారా తయారు చేస్తరు కానీ, తినే లడ్డూలు కూడా తయారు చేస్తారా? తింటే ఒళ్లంతా తిప్పుతుందా’ అని చాలామంది అడిగేది. వాటిని అనుమానంగా చూసేది. ఇలాంటి చేదు అనుభవాలు అనేకం ఉన్నయ్. అనుకోకుండా ఢిల్లీలో ఒక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసేందుకు అవకాశం వస్తే వెళ్లాను. ఈ లడ్డూల గురించి ప్రధానమంత్రి కూడా అడిగి తెలుసుకున్నడు. ఇంత పేరొచ్చినా అక్కడ 15 రోజులల్ల కేవలం 20 కిలోల లడ్డూలు మాత్రమే అమ్మగలిగినం. ఢిల్లీ నుంచి రిటర్న్ రైలు ఎక్కుతుంటే చాలా దుఃఖమొచ్చింది. ‘అసలు నేనెందుకు ఇంత చేయాలి. నాకు అవసరమా!?’ అనిపించింది.
ఇప్పపువ్వు లడ్డూలు తయారు చేసేందుకు ఉపయోగించే ఇప్పవువ్వు కేవలం మార్చి నెలలో మాత్రమే దొరుకుతది. వాటంతట అవే చెట్టునుంచి ఉదయం వరకు నేల రాలుతయి. వాటిని ఏరుకొచ్చి, శుద్ధి చేసి, ఎండబెట్టుకుని నిల్వ చేస్తాం. దాన్ని పల్లీలు, నువ్వులతో కలిపి గ్రైండర్ పట్టి పొడిగా చేసుకుంటాం. దీన్ని బెల్లం పాకంల కలిపి లడ్డూలు చుడుతం. ఏడాదంతా పనుంటది. ‘ఆదివాసీ భీంబాయి మహిళా సంఘం’ పేరుతో నిర్వహిస్తున్న ఈ లడ్డూల తయారీలో 14 మంది మహిళలు ఉపాధి పొందుతున్నరు. ఒక్కో మహిళకు రోజుకు రూ.400 చెల్లిస్తున్న. ప్రారంభంలో నష్టాలు వచ్చినా.. 2023 నుంచి కాస్త ఆదాయం కండ్లవడుతున్నది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.5 లక్షల ఆదాయం వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాలతోపాటు దుబాయికి కూడా మా లడ్డూలను ఎగుమతి చేస్తున్నాం. ఎక్కువ శాతం ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు పంపిస్తున్నాం. సుమారు 60 హాస్టళ్లకు మా లడ్డూలు వెళ్తున్నయి. బడులు ఉన్నప్పుడు రోజుకు క్వింటాల్ లడ్డూలు తయారు చేస్తం. ఎండకాలంలో రోజుకు 70 కిలోల లడ్డూలు చేస్తం.

ఈ ఆదివాసీ గూడెం బిడ్డ ఢిల్లీ వరకు వెళ్లొచ్చిందంటే కారణం.. అడవితల్లే. మా పనులన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటయి. ఇప్పపువ్వు లడ్డూలు ఆరునెలల వరకు పాడవకుండా ఉంటయి. ముందు తరాలకు వీటిని అందించాలనే లక్ష్యంతో ఉట్నూరులో ఒక చిన్నపాటి కంపెనీ (ఫ్యాక్టరీ) లాగా ఏర్పాటు చేసుకున్నాం. లడ్డూలు కావాల్సిన వాళ్లు అక్కడికే వచ్చి మా తయారీని చూసి మరీ కొనుక్కుంటున్నారు. ట్రైబల్ అధికారుల ప్రోత్సాహంతో ఝార్ఖండ్, ఖమ్మం మహిళలకు సైతం ఈ లడ్డూలు ఎట్ల తయారు చేయాల్నో చెప్పిన. ఒకప్పుడు ఆడవి ఉత్పత్తులను ఇష్టపడి తినేవాళ్లు కూడా ప్రస్తుతం బియ్యాన్ని తినడం అలవాటుగా మార్చుకొని రోగాలు కొని తెచ్చుకుంటున్నరు.
అడవితల్లి ఇచ్చిన నాణ్యమైన తిండిని ఆదివాసీలు కూడా తినడం మానేశారు. ఆ తిండిని బతికించుకోవడంలో నా వంతు పాత్ర పోషిస్తున్నా. ఇప్పపువ్వు లడ్డూలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
నాకు లభించిన మహిళా శక్తి అవార్డు, గవర్నర్‌తో తేనీటి విందు, ఇటీవల కాలంలో మన్‌కీ బాత్‌లో ప్రధానమంత్రి ప్రశంసలు.. వీటన్నిటికీ కారణం ఒక పనిని పూర్తి చేయాలనే సంకల్పం మాత్రమే. నా ఎదుగుదలలో నా కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. మా టీం సభ్యుల తోడ్పాటు లేకపోతే ఇంత వరకు వచ్చేదాన్ని కాదు. నేను చదువుకుని ఉంటే మరింతగా మార్కెటింగ్ చేసుకునేదాన్నేమోనని అనిపిస్తుంటుంది.