నమస్తే తెలంగాణ క్రీడా విభాగం
క్రికెట్ ప్రపంచంలో ఫాస్ట్ బౌలర్ల కెరీర్ అనేది గాయాలు, వయస్సు ప్రభావంతో తరచూ ఒడిదుడుకులకు లోనవుతుంటుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత ఒక పేసర్ తన వేగాన్ని, పదునును కాపాడుకోవడం అంత సులభం కాదు. కానీ, వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 36 ఏళ్ల లేటు వయసులో ఈ అంచనాలను తలకిందులు చేస్తున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను వణికిస్తున్నాడు. టైటిల్ నిలబెట్టుకునే వేటలో ఉన్న డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బౌలింగ్ దాడిని అద్భుతంగా నడపిస్తున్నాడు. బ్యాటర్ల ధాటికి మిగతా పేసర్లు తేలిపోతున్న వేళ తన అనుభవాన్ని రంగరించి స్వింగ్ సునామీ సృష్టిస్తున్నాడు. గత నెల చివర్లో ఢిల్లీ గడ్డపై హేజిల్‌వుడ్‌తో కలిసి ఈ సీజన్‌కే హైలైట్ అనదగ్గ స్పెల్ (3/5) వేసిన భువీ ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో మరో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో పడగొట్టిన నాలుగు వికెట్లు ఆటపై తనకు ఉన్న పట్టుకు నిదర్శనంగా నిలిచాయి. ర్యాన్ రికెల్టన్ను లైన్‌కు అడ్డంగా షాట్ ఆడేలా పురికొల్పడం.. రోహిత్ శర్మను నకుల్ బాల్‌తో బోల్తా కొట్టించడం, సూర్యకుమార్‌ను టెస్ట్ మ్యాచ్ లెంగ్త్ బంతితో ఇబ్బంది పెట్టిన భువీ పిచ్‌ను అంచనా వేయడంలో, ప్రత్యర్థి ఆటను చదవడంలో తనకు తిరుగులేని నిరూపించాడు.
వికెట్లు తీయడమే కాకుండా, ప్రత్యర్థి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేస్తూ ఆర్సీబీ విజయాల్లో భువనేశ్వర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 21 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు. 2017 తర్వాత మెగా లీగ్‌లో భువీ సాధించిన అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం విశేషం. భువీ పడగొట్టిన 21 వికెట్లలో 10 గుడ్ లెంగ్త్ బంతులకే రావడం గమనార్హం. బ్యాటర్ల హవా నడుస్తున్న నయా జమానాలో బౌలర్లు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తుంటే ఈ వెటరన్ పేసర్ మాత్రం తన స్వింగ్ బలాన్నే నమ్ముకొని సక్సెస్ అవుతున్నాడు. ఆధునిక క్రికెట్లో బ్యాటర్లు వైవిధ్యమైన షాట్లతో భారీ స్కోర్లు చేస్తున్నా, భువీ మాత్రం కేవలం 7.46 ఎకానమీ రేటుతో పరుగులు ఇస్తూ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్ ఏదైనా, బ్యాటర్ ఎవరైనా సరే.. బంతిని స్వింగ్ చేస్తూ ఎడ్జ్‌లు రాబడుతున్న ఈ యూపీ పేసర్ యువ బౌలర్లకు స్ఫూర్తిగా నిలుసున్నాడు. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం సహకరించడం కష్టమని గుర్తించిన భువీ సరైన విశ్రాంతి, శిక్షణతో తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు.
భువనేశ్వర్ చివరగా 2022 నవంబర్‌లో టీమ్ ఇండియా తరఫున బరిలోకి దిగాడు. యువ బౌలర్లతో పోటీలో వెనుకబడి తిరిగి రాలేకపోయాడు. అయితే భారత జట్టుకు దూరమైన తొలి రోజే ఆ వాస్తవాన్ని అంగీకరించానని భువీ అంటున్నాడు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది యూపీ టీ20, సయ్యద్ ముస్తాక్ అలీ, ఐపీఎల్ వంటి ఎంపిక చేసిన టోర్నీల్లో మాత్రమే ఆడుతున్నాడు. కానీ, కీలక సమయాల్లో వంద శాతం ప్రదర్శన ఇచ్చేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక వేదికపై ముద్ర వేస్తూ తనలో ఇంకా చాలా ఆట మిగిలుందని నిరూపిస్తున్నాడు. నేటి తరం బ్యాటర్లు సీనియర్ బౌలర్ల పట్ల ఎలాంటి భయం లేకుండా దూకుడుగా అడుతుండగా.. బంతిని సరైన లెంగ్త్‌లో వేస్తూ వారిని కట్టడి చేసున్న భువీ చూపిస్తున్న ఈ పట్టుదల, కసి యువ క్రికెటర్లకు పాఠం అనొచ్చు.