ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం.. నెట్లో చూసెయ్! మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది.. నెట్లో వెతికేయ్! ఆ ఊరి ప్రత్యేకతలేంటి.. నెట్లో సెర్చ్ చెయ్! పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనేదాకా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ మన జీవితంలో నిత్యావసరాలుగా మారిపోయాయి. ఆ ‘నిత్యం’ శ్రుతిమించి, ఇంటర్నెట్ అనే వలలో చిక్కుకొని ఎంతోమంది బానిసలుగా మారుతున్నారట. ఆరోగ్యాన్ని, విలువైన కాలాన్ని వృథా చేసుకొంటున్నారట.
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): వినోదమైనా, విజ్ఞానమైనా, మరే అవసరమైనా ఇంటర్నెట్తో క్షణాల్లో తీరిపోతున్నది. చేతిలో స్మార్ట్ఫోన్ లేకుండా, అందులో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా కదలలేని పరిస్థితికి వచ్చేశాం. సౌలత్ సంగతేమో కానీ, ఇదే ఇప్పుడు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు కారణమవుతున్నది. ఇంటర్”నెట్’లో చిక్కి చాలా మంది జీవితంలో విలువైన క్షణాలను పోగొట్టుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు, అనవసర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంటర్నెట్ వ్యసనం ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నదని, దాన్ని గుర్తించి బయటపడకపోతే చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఫైనాన్సెస్ ఆన్లైన్’ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన సర్వే పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్లడించింది.
కరోనా వల్ల మారిన పరిస్థితులతో చిన్నారులూ స్మార్ట్ఫోన్లను విపరీతంగా వాడుతున్నారు. ఓవైపు ఆన్లైన్ తరగతులు, ఇంటి నుంచి బయటికి కదలలేని పరిస్థితులు వారిని స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వైపు తిప్పాయి. చాలా అంశాలు వాళ్లను స్మార్ట్ఫోన్లకు దగ్గర చేసింది. తల్లిదండ్రులకు కూడా పిల్లల నుంచి స్మార్ట్ఫోన్లను వేరు చేయటం వీలుకాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలామంది చిన్నారులు ఇంటర్నెట్కు బానిసయ్యారు.