న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: కర్ణాటకలో రేగిన హిజాబ్ వివాదం అంతర్జాతీయంగా దుమారం రేపుతున్నది. దీనిపై అమెరికా, పాకిస్థాన్ దేశాలతోపాటు పలువురు ప్రముఖులు స్పందించారు. అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా రాయబారిగా ఉన్న రషద్ హుస్సేన్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. హిజాబ్ ధరించడాన్ని నిషేధించడం మత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ కర్ణాటక పేరును నేరుగా ప్రస్తావించారు. అంతకుముందు పాక్ మంత్రి ఖురేషీ స్పందించారు. హిజాబ్ ధరించినందుకు భయభ్రాంతులకు గురిచేయడం అణచివేత చర్యగా పేర్కొన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ స్పందిస్తూ.. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలలకు వెళ్లడాన్ని తిరస్కరించడం భయంకరమైనదని అన్నారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులు, కాషాయ కండువాలు వేసుకున్న విద్యార్థుల మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన వీడియోను ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ పాల్ పోగ్బా ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశారు.
అంతర్గత అంశాల్లో జోక్యం తగదు: భారత్
అంతర్జాతీయ స్పందనను భారత్ తీవ్రంగా ఖండించింది. హిజాబ్ సమస్య అనేది పూర్తిగా తమ అంతర్గత అంశమని, దీనిపై ఉద్దేశపూరిత వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదనీయం కాదని విదేశాంగశాఖ శనివారం స్పష్టం చేసింది. కర్ణాటకలోని పలు విద్యాసంస్థల్లో డ్రెస్‌కోడ్ అంశంపై న్యాయ పరిశీలనలో ఉన్నదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు.
ఒకే యూనిఫాం ఉండేలా ఆదేశించండి.. సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ: కర్ణాటక హిజాబ్ వివాదం నేపథ్యంలో సుప్రీం కోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది. సమానత్వం, జాతీయ సమగ్రతను పెంపొందించేలా విద్యాసంస్థల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఒకే యూనిఫాం ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలను ఆదేశించాలని పిల్లో కోరారు. నిఖిల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఈ పిల్‌ను దాఖలు చేశారు. లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించేలా సలహాలు ఇచ్చేందుకు జ్యుడీషియల్ కమిషన్ లేదా నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసేలా లా కమిషన్‌ను ఆదేశించాలని కోరారు.