
సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తే తెలంగాణ): కుటుంబంలో చోటు చేసుకుంటున్న కలహాలు, ఒత్తిళ్లను పరిష్కరించే ధర్మజునిగా, సమస్యలను మోసే భీమునిగా, పరివారానికి రక్షకునిగా, తనను నమ్ముకుని వచ్చిన భార్య కు బాసటగా..అత్తారింటికి వెళ్లిన సోదరికి అండగా.. జన్మనిచ్చిన అమ్మా, నాన్నలకు భరోసాగా.. కన్నబిడ్డల ఆలనాపాలన చూసే తండ్రిగా.. సమాజానికి ఓ శక్తిగా.. ఇలా ఇంటింటా బంధం ఓ ఇంధనమై.. దానినే ప్రాణంగా భావించి.. వారి సంతోషం కోసం నిరంతరం శ్రమించే యోధులు వాళ్లు. కష్టాల కడలిలో మునుగుతూ.. నమ్ముకున్న వారికి ఏమీ కాకూడదని తపన పడుతుంటారు. బాధ ఉంటే బయటకు చెప్పుకోకుండా లోలోన కుమిలిపోతారు. కన్నీళ్లు వారివిగా.. సుఖాలు కుంటుబానివిగా భావించి సంతృప్తి చెందుతారు. వారే పురుషులు. అదేం టీ ప్రత్యేకంగా పురుషుల గురించి ఎందుకు అనుకుంటున్నారా? నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఔను ఇది నిజం.
లక్ష్యం ఇదే..!!
కేవలం ప్రముఖుల గురించే కాకుండా గౌరవ ప్రదమైన, నిజాయితీ పరమైన జీవితాలు గడిపే వారి గురించి చాటి చెప్పడం.
సంఘానికి, వర్గానికి, కుటుంబానికి, వైవాహిక వ్యవస్థకూ, శిశు సంరక్షణకూ, పర్యావరణకు పురుషులు ఒనగూర్చిన ప్రయోజనాలు గుర్తించడం.
స్త్రీ పురుషుల మధ్య సఖ్యత.. సరైన సంబంధాలు నెలకొనడం, లింగ సమానత్వాన్ని వ్యాపింప జేయడం, సురక్షిత ప్రపంచాన్ని రూపొందించడానికి కృషి చేయడం.
పురుషుల సాంఘిక, భావోద్వేగ, శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యంపై దృష్టి, సాంఘిక సేవలలో, విలువలలో, అంచానలలో, చట్టాలలో పురుషులు ఎదుర్కొంటున్న వివక్షను చాటడం.
మెన్స్ డే కథ ఇదీ..!
1989లో వెస్ట్ ఇండీస్‌కు చెందిన హిస్టరీ ప్రొఫెసర్ జెరోమ్ టీలుకింగ్స్ తన తండ్రి పుట్టిన రోజైన నవంబర్ 19ని పురుషుల దినోత్సవంగా ఎంపికజేసి విశేషమైన ప్రాచుర్యం కల్పించారు. తన తండ్రి ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నారని ఆయన కష్టం చూశాక పురుషుడికి ఓ రోజు ఉండాలని భావించాడు. ఇండియాలో 2007 నుంచి ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
వివక్ష లేని గృహ హింస చట్టం కావాలి
మహిళలకు అన్యాయం జరిగితే అందరూ పెద్ద మనుషులే. అదే పురుషులకు జరిగితే ఎవరూ ఉండరు. పురుషులకు కూడా సంక్షేమ శాఖ నెలకొల్పాలి. దేశంలో పన్ను కట్టే వారిలో 82 శాతం పురుషులే. కాని, వారి సంక్షేమానికి ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయరు. వివక్షలేని గృహ హింస చ ట్టం కావాలి. పురుషులు అనేక రకాలుగా వేధింపులకు గురవుతున్నారు. ఇవి బయటకు చెప్పుకునే పరిస్థితి పురుషులకు లేదు. ఇది బాధాకరం.
దురుసుగా ప్రవర్తించే ప్రతిబింబాలా?
పురుషుడే ఆధార వనరుగా మారిపోతున్నారు. తనకేం కావాలి ? ఇష్టమైనదీ ఏది? మనస్తత్వం ఏంటీ? తెలుసుకునేలోపునే పురుషుడు యాంత్రిక జీవితాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. పురుషుని త్యాగం అక్కడే మొ దలవుతుంది. స్త్రీ విమోచనకు కృషి చేసిన త్యాగా లు వారివి. పురుష దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పురుషుడిని దురుసుగా ప్రవర్తించే ప్రతిబింబాలుగానే చూడటం మానెయ్యాలి.
స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే..
పురుషులకు బాధలు ఉంటాయి. కాని, వారు బయటపడరు. చిన్నప్పటి నుంచి వారు పెరిగిన విధానం వేరు. మగాళ్లు ఏడవకూడదు అనే నిబంధన వాళ్ల పేటెంట్‌లా ఉంటారు. దీంతో ఎలాంటి ఒత్తిడినైనా లోలోన భరిస్తారు. ఈ కారణంగా వారు డిప్రెషన్‌కు గురవుతారు. ఆత్మహత్య ఆలోచనలు చేస్తారు. సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు అన్నింటిలో సమానమే. నిరంతరం సంపాదనపైనే ధ్యాస కాకుండా వారి ఆరోగ్యం, సంతోషంపై కూడా దృష్టి సారించాలి.